TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మోడీ బాటలోనే చంద్రబాబు, పవన్ కల్యాణ్.. కాన్వాయ్ లోని వాహనాల తగ్గింపు

Published on: Thu May 14, 2026 9:16AM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన కాన్వాయ్ లోని వాహనాలను తగ్గించుకునేందుకు నిర్ణయించుకున్నారు. అలాగే ఉప ముఖ్యమంత్రి కూడా అదే దారిలో అడుగులు వేస్తున్నారు.  ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించే దిశగా బాబు, పవన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.   తమ కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను తగ్గించాలని అధికారులకు విస్పష్ట ఆదేశాలు జారీ చేశారు. పొదుపు చర్యలలో భాగంగా ప్రధాని నరేంద్రమోడీ తన వాహన శ్రేణిని కుదించాలని ఆదేశాలు జారీ చేసిన గంటల వ్యవధిలో ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు అదే దారిని ఎంచుకోవడం గమనార్హం. 

సాధారణంగా ముఖ్యమంత్రులు, మంత్రుల పర్యటనల సమయంలో భద్రతా కారణాల రీత్యా పెద్ద సంఖ్యలో వాహనాలు కాన్వాయ్‌లో ఉంటాయి. అయితే..  దీనివల్ల భారీగా ఇంధన వ్యయం అవ్వడమే కాకుండా..  ట్రాఫిక్ ఇబ్బందులు కూడా తలెత్తుతున్నాయని  భావించిన సీఎం, డిప్యూటీ సీఎం..  ఖజానాపై అనవసర భారం పడకూడదనే ఉద్దేశంతో, భద్రతకు విఘాతం కలగకుండానే వాహనాల సంఖ్యను తగ్గించాలని నిర్ణయించారు. 

వీరు తీసుకున్న ఈ నిర్ణయం వెనుక   పొదుపు వ్యూహం కనిపిస్తోంది. రాష్ట్రం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్ల నేపథ్యంలో, పై స్థాయి నుండి పొదుపు చర్యలు ప్రారంభం కావాలని  భావిస్తున్నారు. ఈ నిర్ణయం ద్వారా నెలకు లక్షల రూపాయల ఇంధన ఖర్చు ఆదా కావడమే కాకుండా, నిర్వహణ వ్యయం కూడా తగ్గుతుందని అధికారులు అంటున్నారు. 

ప్రజా ప్రతినిధులు,  ఉన్నతాధికారులు అనవసర ఆడంబరాలకు పోకుండా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్న బలమైన సందేహాన్ని కూడా వీరి నిర్ణయంతో ఇచ్చారని చెప్పాలి.  గతంలో కూడా చంద్రబాబు తన పర్యటనల సమయంలో సామాన్యులకు ఇబ్బంది కలగకూడదని ట్రాఫిక్ ఆంక్షలను తగ్గించాలని ఆదేశించిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు నేరుగా తన కాన్వాయ్‌పైనే నియంత్రణ విధించడం చర్చనీయాంశంగా మారింది.