ఉద్దానంపై చంద్రబాబు.. పనిచేసేవాళ్లపై విమర్శలా..

 

శ్రీకాకుళం జిల్లాలో కిడ్నీ వ్యాధిగ్రస్తులు అధికంగా ఉన్న ఏడు మండలాల్లో వెంటనే ప్రజలందరికీ రక్షిత మంచినీటిని అందించాలని, వెంటనే వైద్య ఆరోగ్య శాఖా మంత్రిని ప్రకటించాలని... కొత్త మంత్రిని పెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వానికి తాను 48 గంటల గడువును ఇస్తున్నానని, ఈలోగా చంద్రబాబు దిగొచ్చి, ప్రజల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని..లేకపోతే దాను నిరాహారదీక్షకు దిగుతానని డెడ్ లైన్ పెట్టిన సంగతి తెలసిందే. అయితే ఆ గడువు ముగియడంతో. పవన్ నిరాహార దీక్షకు దిగిన సంగతి కూడా విదితమే. శ్రీకాకుళం ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‌‌లో నిన్న సాయంత్రం 5 గంటలకు నిరాహార దీక్షకు దిగారు. ఈరోజు సాయంత్రం 5 గంటల వరకూ దీక్ష కొనసాగుతుంది.

 

అయితే ఇప్పుడు దీనిపై చంద్రబాబు స్పందించినట్టు తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లాలోని ఉద్ధానం కిడ్నీ వ్యాధిగ్రస్థులని ఆదుకుంటున్నామని..ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ట్విట్టర్‌లో పేర్కొన్నారు. "క్రానిక్ కిడ్నీ వ్యాధుల మూలాల్ని కనుగొనడానికి పరిశోధన మొదలైంది. ఉద్ధానం ప్రాంతంలోని 18 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య అధికారులకు సంబంధిత శిక్షణను అందిస్తున్నాం. కిడ్నీ వ్యాధితో బాధపడుతోన్న వారికి దగ్గరలోనే డయాలిసిస్ కేంద్రాలు ఏర్పాటు చేసి వైద్యాన్ని చేరువ చేస్తున్నాం. శ్రీకాకుళం రిమ్స్‌లో 16, టెక్కలి ఏరియా ఆసుపత్రిలో 8, పాలకొండ ఏరియా ఆసుపత్రిలో 5, పలాస సామాజిక ఆసుపత్రిలో 8, సోంపేట సామాజిక ఆసుపత్రిలో 12 డయాలిసిస్ మిషన్లను ఏర్పాటు చేశాము. ఉద్ధానం సమస్యపై ప్రత్యేక చొరవతో కార్యక్రమాలు చేపడుతున్నాము. గత ఏడాది జనవరి నుండి ఏప్రిల్ 15వ తేదీ వరకు ఉద్ధానం 7 మండలాల్లోని 176 గ్రామాల్లో స్క్రీనింగు నిర్వహించి 1,01,593 మందిలో రుగ్మతలను గుర్తించారు. వారిలో 13,093 మందిని కిడ్నీ సంబంధిత వ్యాధి పరీక్షలకు సిఫారసు చేశారు" అని చంద్రబాబు అన్నారు.

 

అంతేకాదు రాష్ట్రవ్యాప్తంగా లక్షకుపైగా రోగుల నుంచి నమూనాలు సేకరించామని.. 13వేలమందికిపైగా క్రమం తప్పకుండా చికిత్స జరుగుతోందన్నారు. ప్రతి నెలా 2761మంది పేషంట్లకు రూ.రూ.2,500 పింఛన్ ఇస్తున్నామని.. రూ.17కోట్లతో 7 ఆర్వో ప్లాంట్లు కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. రోగులకు ప్రతి 15 రోజులకు ఒకసారి నెఫ్రాలిజిస్టు ద్వారా వైద్య సేవలు కూడా అందుతున్నాయని చెప్పారు. ఇక 5 డయాలసిస్ సెంటర్లలో.. 50 మిషన్ల ద్వారా 3 సెషన్లు పని చేస్తున్నాయన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కిడ్నీ రోగులకు పింఛన్లు ఇష్తున్న ఏకైక రాష్ట్రం ఏపీనే అన్నారు బాబు. ఉద్ధానం బాధితుల్ని టీడీపీ ప్రభుత్వం పట్టించుకున్నట్లు ఎవరూ పట్టించుకోలేదని..గత ప్రభుత్వాలు ఇలాంటి సేవలు చేశాయా... పనిచేసే వారిని విమర్శిస్తే ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళతాయని అన్నారు... మరి దీనిపై పవన్ ఎలా స్పందిస్తారో చూద్దాం...