సీఎం అనాలా? లేక బావగారు అనాలా..?


ఇటీవల విడుదలైన 'మహానటి' సినిమా ఎంత ఘన విజయం సాధించిందో తెలిసిందే. సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరిపై ప్రశంసలు కురిపించారు. ఇక ఇప్పుడు తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  కూడా ‘మహానటి’ చిత్ర యూనిట్ పై ప్రశంసల జల్లు కురిపించారు. అమరావతిలోని ప్రజాదర్బార్‌ హాల్‌లో ‘మహానటి’ చిత్రబృందం చంద్రబాబును కలిసింది. ఈ సందర్బంగా ఆయన  ‘మహానటి’ సినిమాపై ప్రశంసల జల్లు కురిపించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. సావిత్రి జీవితానికి సార్థకత తీసుకురావాలనే పట్టుదలతో ఈ సినిమాలో కీర్తి సురేష్ బాగా నటించారని కొనియాడారు. సావిత్రి తన జీవితంలో పడిన కష్టాలకు ఈ సినిమా అద్దం పట్టిందని... కష్టాల్లో కూడా ఇతరులకు సహాయ పడాలనే సావిత్రి జీవితం ప్రతిఒక్కరికీ ఆదర్శమని అన్నారు. ‘మహానటి’ సినిమాను చాలా చక్కగా తీసినందున నిర్మాతలు స్వప్న, ప్రియాంక దత్‌లను చంద్రబాబు మనస్ఫూర్తిగా అభినందించారు. రెండు సంవత్సరాలు ‘మహానటి’ జీవితాన్ని అధ్యయనం చేసి, మంచి సినిమాను తీసినందుకు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ను మెచ్చుకున్నారు. చిత్ర బృందం ఎంతో సాహసంతో ఈ సినిమాను తీసి మంచి విజయాన్ని అందుకుందని చంద్రబాబు అన్నారు. సావిత్రిది కూడా రాజధాని అమరావతిలోని గ్రామమే కావటం విశేషమని పేర్కొన్నారు.

 

అనంతరం చిత్ర యూనిట్ ని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సన్మానించారు. ఇక తనకు సన్మానం అనంతరం సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి మాట్లాడుతూ, ‘ముఖ్యమంత్రి చంద్రబాబును సీఎం అనాలా? లేక బావగారు అని పిలివాలో’ తెలియడం లేదని అన్నారు. చంద్రబాబు కుటుంబంతో తమకు ఎంతో అనుబంధం ఉందని, చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని ‘అక్కా’ అని పిలిచే దానినని చెప్పారు. చిత్రయూనిట్ ని సన్మానించడంపై సంతోషం వ్యక్తం చేశారు.