ఇవి సర్కారు హత్యలే...

 

తూర్పుగోదావరి జిల్లా మంటూరు పశ్చిమగోదావరి జిల్లా కోండ్రుకోట సమీపంలోని వాడపల్లి మధ్య గోదావరి నదిలో పడవ మునిగిపోయి ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. సుమారు 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ భారీ వర్షం, గాలుల ధాటికి నీట మునిగింది. ఇక ఈ ప్రమాదంలో 40మందికి పైగా గల్లంతయ్యారు. లాంచీ అరవై అడుగుల లోతులో ఉన్నట్టు అధికారులు గుర్తించారు. నీటిలో ఉన్న లాంచీ అద్దాలు పగలగొట్టినా దాని లోపలకి వెళ్లేందుకు ఇబ్బందిగా ఉందని, లాంచీ తలుపులు తెరిచేందుకు ఎంత యత్నించినా సాధ్యం కాలేదని కలెక్టర్ కార్తికేయ మిశ్రా పేర్కొన్నారు. మృతదేహాలు కూడా పడవలోనే చిక్కుకుని ఉండిపోవడంతో సహాయ బృందాలకు సవాల్‌గా మారింది. అయితే  పడవకు తాళ్లు కట్టి భారీ క్రేన్ల సాయంతో దాన్ని ఎట్టకేలకు ఒడ్డుకు తీసుకొచ్చారు. అందులో చిక్కుకుని ఉన్న మృతదేహాలను సహాయ సిబ్బంది వెలికితీస్తున్నారు. కాగా ముఖ్యమంత్రి చంద్రబాబు కొద్దసేపటి క్రితం హెలికాప్టర్లో ప్రమాద స్థలానికి చేరుకుని సహాయచర్యలను పరిశీలిస్తున్నారు. ఆయన వెంట పలువురు మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు.

 

 

ఇక ఈఘటనపై స్పందించిన ప్రతిపక్షనేత జగన్మోహన్ రెడ్డి ఎప్పటిలాగే  ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు. మీడియాతో మాట్లాడిన ఆయన... "ఇది చాలా బాధ కలిగించిన ఘటన. దాదాపు 40 మంది మృతి చెందారు. వీటిని సర్కారు హత్యలుగానే పరిగణించాలి. గతేడాది నవంబరులో కృష్ణా జిల్లాలో చంద్రబాబు ఇంటికి కొద్ది దూరంలోనే ఓ బోటు మునిగింది. అప్పట్లో 20 మందికి పైగా చనిపోయారు. ఇప్పటికీ ప్రభుత్వం మేల్కోలేదు. లైసెన్సులు లేకుండా బోట్లను తిప్పుతున్నారు. వారు లంచాలు ఇస్తున్నారు... అందుకే ముఖ్యమంత్రి ఇటువంటి ఘటనలపై స్పందించరు. ఐదు రోజుల కిందటే ఓ బోటులో అగ్ని ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తు ఎవ్వరూ చనిపోలేదు. అది జరిగిన ఐదురోజులకే మళ్లీ మరో బోటు నీళ్లలో మునిగిపోయింది. దాదాపు 40 మంది చనిపోయారు. మంత్రుల దగ్గరనుంచి చంద్రబాబు వరకు లంచాలు అందుతున్నాయని మండిపడ్డారు.