వారికి భూమిపై అదే చివరి రోజు..


గుంటూరుజిల్లా దాచేపల్లిలో జరిగిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే కదా. తొమ్మిదేళ్ల చిన్నారిపై..సుబ్బయ్య అనే వ్యక్తి అత్యాచారం చేయడంతో దాచేపల్లిలో స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. నిందితుడిని పట్టుకోవాలని.. కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇక ఒకపక్క ఆందోళనలు చేస్తుంటే.. మరోపక్క నిందితుడు సుబ్బయ్య ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది. దీంతో సుబ్బయ్య మృతదేహాన్ని తమకు అప్పగించాలని.. నడిరోడ్డుపై కాల్చాలని బాధితురాలి కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు.

 

ఇక ఇప్పుడు ఈ ఘటనపై స్పందించిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాగరిక సమాజంలో బతికేటప్పుడు మనుషులకు భయం కూడా ఉండాలని హెచ్చరించారు. ఈరోజు గుంటూరు ఆస్పత్రిలో బాధితురాలిని పరామర్శించిన ఆయన మాట్లాడుతూ.. దాచేపల్లి ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని, ఇలాంటి ఘటనలు ఇకపై జరగడానికి వీల్లేదని ఆయన తెలిపారు. ఇలాంటి తప్పులు చేసేవారికి ఈ భూమ్మిద అదే చివరి రోజు అవుతుందని ఆయన హెచ్చరించారు. అలాంటి నీచులకు రాష్ట్రంలో నివసించే హక్కులేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.   ‘మనిషి మనిషిగా బతకాలి... మనుషుల్లో మానసిక పరివర్తన రావాలి... దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరగాలని సూచించారు. అంతేకాదు... అమ్మాయిలకు సంఘీభావంగా రాష్ట్రవ్యాప్తంగా సోమవారం ‘ఆడబిడ్డల రక్షణకు కదులుదాం’ కార్యక్రమాన్ని నిర్వహించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. నీచమైన నేరాలను అందరూ ఖండించాలని, ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆయన సూచించారు. ప్రతి మండల కేంద్రంలో ఆ మండలంలోని పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించాలని సూచించారు.