ధర్మరాజును మించిపోయిన చంద్రబాబు...

 

ధర్మరాజు... మహాభారతం తెలిసిన వారికి ఈయన గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. పాండవులలో పెద్దవాడైన ఈయన సహనానికి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకొవచ్చు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా.. ఎంతటి ఆపదలు ఎదురైనా....ఎంతో సహనంతో ఉండగల వ్యక్తిత్వం అతనిది.. అలా అని అన్ని సందర్బాలలో అలానే ఉంటాడని కాదు. శత్రువును ఎలా దెబ్బకొట్టాలో కూడా ఆయనకి బాగా తెలుసు. తిక్కన అంతటి కవి బ్రహ్మ ధర్మరాజును "మెత్తని పులి" అని అన్నాడంటే అది చాలా ఆలోచించాల్సిన విషయం.. ఎందుకంటే...  పైకి మెత్తగా, శాంతియుతంగా కనిపిస్తాడు.. కానీ కాదు. ప్రతీకారవాంఛ వుంటుంది. కానీ సమయం,సందర్భం చూసుకోవాలి. సహనం వహిస్తాడు. కానీ ఎలా దెబ్బ కొట్టాలో అలా కొడతాడు. ఇంతకీ ఈ ధర్మరాజు కథ ఎందుకనుకుంటున్నారా... అయితే ఆ యుగంలో ధర్మరాజుకి ఎంత సహనం ఉందో.. ఇప్పుడు ఈ రాజకీయాల్లోకి వస్తే చంద్రబాబుకు అంత సహనం ఉందని చెప్పొచ్చు.

 

నిజానికి అందరి నాయకులతో పోల్చుకుంటే చంద్రబాబుకి సహనం కాస్త ఎక్కవే. ప్రస్తుత పరిస్థితులు చూస్తూనే అర్ధం చేసుకోవచ్చు. యూపీఏ హయాంలో రాష్ట్రాన్ని రెండుగా చీల్చినా.. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఏపీకి ఏదో చేస్తామని.. పొడిచేస్తామని మాటలు చెప్పినా ఇప్పటివరకూ ఏపీకి జరిగింది ఏం లేదు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయినా.. బీజేపీతో టీడీపీ మిత్రపక్షంగా ఉన్నా ఏపీని ఎప్పుడూ చిన్నచూపు చూశారు తప్పా... మోడీ ఏపీకి చేసింది ఏం లేదు. అలా అని చంద్రబాబు వారిపై కోప్పడటం కానీ.... మిత్రుత్వాన్ని తెచ్చుకోవడం చేయలేదు. ఎదురుచూస్తూనే వచ్చారు. ప్రతిపక్ష పార్టీలు ఎన్ని తనపై ఎన్ని విమర్శలు గుప్పించినా... చాలా సహనంతో ఉన్నారే తప్పా.. తిరిగి ఒక్క మాట అనకుండా ఉండేవారు. బీజేపీ పెద్దలు కూడా ఎన్ని మాటలు అన్నా...ఇప్పటికే ఎన్నోనిధులు ఇచ్చాం అని అంటున్నాం... రాష్ట్రాభివృద్దికోసం కాస్త తగ్గి.. కేంద్రం చుట్టూ తిరుగుతూ.. వారిని అడుగుతూనే ఉన్నాయి. ఆఖరికి కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాత ప్రతిఒక్కరూ బీజేపీ తీరును ఎండగడుతున్నారు. అయినా చంద్రబాబు మాత్రం ఇంకా ఎదో ఆశతోనే ఉన్నట్టు కనిపిస్తోంది. అందుకే ఎంపీలనైతే పార్లమెంట్లో నిరసనలు చేయమన్నారు కానీ... బీజేపీతో తెగదెంపులు చేసుకుంటున్నామని మాత్రం చెప్పలేకపోతున్నారు.

 

ఇక విషయంపై టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కూడా స్పందిస్తూ చంద్రబాబు నాయుడిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా... నిర్మొహమాటంగా చెప్పడంలో దిట్ట అయిన జేసీ పార్లమెంట్ ప్రాంగణంలో ఈరోజు మీడియాతో మాట్లాడుతూ....రాష్ట్ర విభజన చట్టంలో ఉన్నదొకటి, ఈరోజున అమలు పరుస్తామంటున్నది మరోటి అని మండిపడ్డారు. ఏపీకి ఏదో ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని అన్నారని, ఇప్పుడు, ఆ ప్యాకేజీ లేదూ, పీకేజీ లేదంటూ విమర్శించారు. బీజేపీతో  ‘‘మేము మిత్రపక్షంగా ఉండాల్సిన అవసరముందా?’ అని పునరాలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ముఖ్యమంత్రి గారికి సహనం ఎక్కువ. ఇంకా, ఏదో జరుగుతుందనే ఆశలో ఉన్నారు. ఆ మహానుభావుడు ఇంకెంత కాలం చూస్తాడో! ఈ సహనమే కొంపముంచుతోంది. సహనానికి కూడా హద్దుండాలి! ధర్మరాజు కంటే సహనపరుడెవరూ లేరు. ఆయన అడుగుజాడల్లో ఈయన నడుస్తున్నారు..నాడు ధర్మరాజు అంతటి వాడే యుద్ధానికి ‘సై’ అన్నాడు, మరి, ఈయన (చంద్రబాబు) ఎప్పుడంటారో చూడాలంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరి రాజకీయ చాణక్యుడని చంద్రబాబుకి మాములుగా పేరు రాలేదు. ఆయన ఇంకా సహనంగా ఉన్నారంటే... ఆయన స్ట్రాటజీ ఏంటే ఆయనకే తెలుసు. ఎన్నో ఏళ్ల రాజకీయానుభవం ఉన్న చంద్రబాబుకి తెలుసు కదా అన్నీ.. చూద్దాం ఏం జరుగుతుందో...