కేసీఆర్ పిలవలేదు... కానీ చంద్రబాబు

 

ఎక్కడ నెగ్గాలో కాదు... ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు గొప్పవాడు అని ఓ సినిమాలో డైలాగ్ గుర్తుంది కదా. ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును చూస్తే ఆ డైలాగ్ గుర్తుకువస్తుంది. దీనికి కారణం లేకపోలేదు. రాష్ట్ర విభజన జరిగిపోయి ఇప్పటికి నాలుగేళ్లు అయిపోయింది. ఏదో విడిపోయినప్పుడు.. విడిపోయినా తెలుగు ప్రజలు అన్నాదమ్ముళ్లు, అక్కా చెల్లెళ్లలాగానే కలిసి ఉందామని... విడిపోయినా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ ఒక్కటే అని ఎన్నో మాటలు చెప్పారు. చెప్పడానికైతే చెప్పారు కానీ.. అవన్నీ మాటలే అని చాలాసార్లే నిజమైంది. ఇంకా తెలంగాణ, ఆంధ్ర మధ్య అక్కడక్కడా విభేదాలు, వైరుధ్యాలు పొడసూపుతునే వున్నాయి. 

 

ఇక సామాన్య ప్రజల సంగతేమో కానీ.... తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే బహిరంగంగా చెప్పకనే చెప్పారు చాలాసార్లు. ఇటీవల జరిగిన రెండు సంఘటనలే దీనికి ఉదాహరణగా చెప్పొచ్చు. అమరావతి శంకుస్థాపన సమయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా కేసీఆర్ ఇంటికి వెళ్లి.. ఆహ్వానించారు. కానీ ఇటీవల హైదరాబాద్ వేదికగా అట్టహాసంగా జరిగిన “ప్రపంచ తెలుగు మహాసభలు“ కు మాత్రం చంద్రబాబును పిలవలేదు. ఈ సభల కోసం దేశవిదేశాల ప్రముఖులకు ఆహ్వానాలు పంపిన కెసిఆర్... తెలుగు మహాసభలు అని పేరు పెట్టుకొని పక్కన ఉన్న తెలుగు రాష్ట్ర సీఎం అయిన చంద్రబాబును పిలవలేదు. అయితే ఈ విషయంలో మాత్రం కేసీఆర్ కు విమర్శలు పెద్ద ఎత్తునే వచ్చాయి. తెలుగు సభలు అని పేరు పెట్టుకొని ఎక్కడో ఉన్న వాళ్లని పిలిచారు కానీ.. పక్కన ఉన్నసీఎంను మాత్రం పిలవలేదని... కావాలనే కేసీఆర్ పిలవలేదని విమర్శలు గుప్పించారు. దీంతో మేము పిలవాలి అనుకున్నా బాబు బిజీగా ఉంటారని తెలుసుకుని పిలవలేదని ఏదో కలరింగ్ ఇచ్చారు.

 

అయితే చంద్రబాబు మాత్రం కేసీఆర్ చేసిన తప్పు చేయలేదు. విజయవాడలో ఓ భారీ బుక్ ఫెస్టివల్ జరుగుతోన్న నేపథ్యంలో... కవుల్ని సత్కరించాలని నిర్ణయించారు. దీనికి గాను రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పలువురు కవులకు ఆహ్వానాలు పంపారు. అయితే ప్రపంచ తెలుగు మహాసభల అనుభవంతో తెలంగాణ కవులకు ఆహ్వానాలు ఉండవని అంతా భావించారు. ఆ అంచనాలు తల్లకిందులు చేస్తూ ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణ కవులు, రచయితలకు పిలుపులు వెళ్లడంతో షాక్ కు గురయ్యారట. ఈ నేపథ్యంలో కెసిఆర్ పిలవకపోయినా బాబు పిలిచి మరీ సత్కరించడం చూసి చాలా మంది బాబుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే కొందరు మాత్రం.... కొందరు ఆంధ్ర వాళ్ళు అంత అవసరం ఏంటని ప్రశ్నిస్తుంటే, ఇంకొందరు మాత్రం పెద్దరికం నిలుపుకున్నారని అంటున్నారు. మొత్తానికి చంద్రబాబు మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు.