TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చిన్న పామునైనా పెద్ద కర్రతోనే కొట్టాలి... లేదంటే పాలు పోసినట్లే

Published on: Tue Jun 6, 2017 11:38AM

 

చిన్న పామునైనా పెద్ద కర్రతోనే కొట్టాలంటారు... అందుకే ఏపీలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినా... కాంగ్రెస్‌ పార్టీ మళ్లీ పుంజుకోవాలని ప్రయత్నిస్తుండటంతో... టీడీపీ అధినేత చంద్రబాబు సీరియస్‌గానే తీసుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీకి ఎవరు ఓట్లేస్తారులే... అని లైట్‌ తీసుకోకుండా... ఆ పార్టీ చేసిన తప్పుల్ని ప్రజల ముందు పెడుతున్నారు. ప్రజలను అప్రమత్తం చేస్తూ... విభజన చేసిన తీరు, ఆ సమయంలో కాంగ్రెస్‌ వ్యవహరించిన విధానాన్ని ఎండగడుతున్నారు. ఇదే విషయాన్ని టీడీపీ శ్రేణులకు వివరిస్తున్న చంద్రబాబు... రాష్ట్రానికి కాంగ్రెస్‌ పార్టీ చేసిన అన్యాయాలను ప్రజలకు గుర్తుచేయాలని చెబుతున్నారు.

 

జగన్‌ ఢిల్లీ పర్యటన, ఎన్డీఏకి మద్దతిస్తామన్న ప్రకటన తర్వాత వైసీపీ బలహీనపడిందని, కొన్ని వర్గాల ప్రజలు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి దూరం జరుగుతున్నారని చంద్రబాబు అంచనా వేశారు. అదే సమయంలో ఆ ఓటర్లందరూ మళ్లీ కాంగ్రెస్‌ వైపు మళ్లే అవకాశముందని... అందుకే కాంగ్రెస్‌ చేసిన విభజన గాయాలను ప్రజలకు వివరించాలని టీడీపీ నేతలకు సూచిస్తున్నారు. అప్రమత్తంగా లేకపోతే కాంగ్రెస్‌ పార్టీ లబ్ది పొందే అవకాశముందని తెలుగు తమ్ముళ్లను హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే డిపాజిట్లు కూడా రాని పరిస్థితి నుంచి బహిరంగ సభ నిర్వహించే స్థితికి ఏపీ కాంగ్రెస్‌ వచ్చిందని గుర్తుచేస్తున్నారు.

 

ఏ చిన్న తప్పు చేసినా ప్రత్యర్ధులకు మనమే పాలు పోసినట్లు అవుతుందన్న చంద్రబాబు... ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులకు సూచించారు. రాజకీయాల్లో విశ్రాంతి, విరామం ఉండకూడదని... అన్ని వర్గాల ప్రజలకు దగ్గరైతేనే గెలుపు సాధ్యమని దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా ఈ మూడేళ్లలో చేపట్టిన అభివృద్ధి-సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేడర్‌కు సూచించారు.