కేంద్రం ఇలా చెబుతుంది.. వాళ్లు అలా చెబుతున్నారు...

 

ఏపీ ప్రయోజనాలో నాకు ముఖ్యం.. ఏపీ ప్రత్యేక హోదా కోసం మా ఎంపీలు పార్లమెంట్లో ఆందోళనలు చేస్తున్నా కేంద్రం మాత్రం పట్టించుకోవడం లేదు అని చంద్రబాబు అన్నారు. ఢిల్లీలో మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేకహోదాతో సమానంగా ప్యాకేజీ ఇస్తా అన్నారు.. రెండేళ్లు ప్యాకేజీ కోసం ఎదురుచూశాం..కనీసం సాయం చేయకుండా మాపై నిందలు వేస్తున్నారు అని మండిపడ్డారు. 14వ ఆర్థిక సంఘం సిఫారసుల కారణంగా ప్రత్యేక హోదాను ఇవ్వలేమని కేంద్రం చెప్పిందని... కానీ, ఆర్థిక సంఘం ఛైర్మన్, సభ్యులను అడిగితే అలాంటిదేమీ లేదని చెప్పారని చంద్రబాబు అన్నారు. చేయాల్సిన సహాయాన్ని చేయకుండానే మాపై విమర్శలు కురిపించే కార్యక్రమాన్ని చేపట్టారని మండిపడ్డారు. నిధులకు సంబంధించిన యూసీలను సమర్పించినప్పటికీ... ఇవ్వలేదని అంటున్నారని విమర్శించారు.

 

ఇంకా పోలవరం గురించి మాట్లాడుతూ... పోలవరాన్ని రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి చేస్తుందని నీతి అయోగ్ చెప్పింది.. రాష్ట్రమే పోలవరం పూర్తి చేసేందుకు కేంద్రం అంగీకరించింది... కానీ ప్రాజెక్టుకు నిధులను సరిగా ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. పోలవరంపై తాము ఖర్చు చేసిన రూ. 3 వేల కోట్లను కేంద్ర ప్రభుత్వం తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు.