వరదల్లో కొట్టుకుపోయిన చంద్రబాబు పేరు....

 

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్ర్లాల్లో వర్షాలు భారీగానే కురుస్తున్నాయి. ఈసారి ఈ వర్షాలకు ఏపీలోని కరువు ప్రాంతంగా పేరు పొందిన అనంతపురం జిల్లా కూడా వరదలతో మునిగిపోయింది. దీంతో రాయలసీమ జిల్లాలోని అనేక చిన్న సాగునీటి ప్రాజెక్టులు, చెరువులు నీటితో కళకళలాడుతున్నాయి. ఇక్కడి వరకూ బాగనే ఉంది. అయితే ఈ వర్షాల వల్ల ఎవరికి ఎంత లాభం చేకూరిందో తెలియదు కానీ.... ఈ వర్షాల వల్ల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఉన్న పేరు మాత్రం వరదల్లో కొట్టుకుపోయింది. ఇంతకీ ఆ పేరు ఏంటనుకుంటున్నారా..? అదేనండి....చంద్రబాబు అధికారంలోకి వస్తే వానలు రావన్న పేరు. చంద్రబాబు అధికారంలోకి వస్తే వానలు రావని… రాష్ట్రంలో కరువు విళయతాండవం చేస్తుందని ఒకప్పుడు అనేవారు. ఒకప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ రకమైన ప్రచారానికి విస్తృతమైన ప్రాముఖ్యత కల్పించడంతో… చాలామంది చంద్రబాబు వస్తే కరువు వస్తుందని విమర్శించడం అలవాటుగా మార్చుకున్నారు. ప్రస్తుతం ఏపీ ప్రతిపక్షం వైసీపీ కూడా ఇదే రకమైన విమర్శలను అనేకసార్లు చేసింది. కాని ఇప్పుడు చంద్రబాబుకు కాలం కలిసివచ్చింది. అందరి విమర్శలకు సమాధానం దొరికింది. గత కొద్ది రోజులుగా వర్షాలు పడటంతో చంద్రబాబుకు ఉన్న పేరు పోయింది. దీంతో రాయలసీమలో వరదలు చూసిన తరువాత ఇక చంద్రబాబుపై ఇక కరువు ముద్ర వేయడానికి ఎవరూ సాహసించలేరని టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.