హైదరాబాదులోనే ఉంటా: చంద్రబాబు

 

ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడను తాత్కాలిక రాజధానిగా ప్రకటించిన తరువాత, ఇక ఏ మాత్రం ఆలశ్యం చేయకుండా వివిధ మంత్రిత్వ శాఖల ప్రధాన కార్యాలయాలను విజయవాడకు తరలించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టమని అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. గన్నవరం విమానాశ్రయం సమీపంలో గల మేధా టవర్స్ ఐటీ పార్కులో ఉన్న విశాలమయిన భవనసముదాయంలో వివిధ శాఖలకు కార్యాలయాలు కేటాయింపు మొదలయినట్లు తాజా సమాచారం. మంత్రి నారాయణ మాట్లాడుతూ త్వరలోనే శాఖల కార్యాలయాలు హైదరాబాదు నుండి విజయవాడకు తరలింపు కార్యక్రమం కూడా మొదలవుతుందని తెలిపారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం ముందు చెప్పినట్లుగానే, హైదరాబాదు, విజయవాడ మధ్య తిరుగుతూ పరిపాలన కొనసాగించవచ్చును. నిజానికి ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం వీలయినంత త్వరగా విజయవాడకు తరలిపోవాలని భావిస్తున్నప్పటికీ, జంట నగరాలలో స్థిరపడిన ఆంద్ర ప్రజల పట్ల తెలంగాణా ప్రభుత్వం వైఖరిలో మార్పు కనబడనంత వరకు అక్కడి నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాదును వీడకపోవచ్చును. ఆయన నిన్న మీడియాతో మాట్లాడుతూ హైదరాబాదులో మరో పదేళ్ళపాటు ఉండేందుకు అవకాశం ఉన్నందున, వీలయినంత కాలం అక్కడ నుండే పరిపాలన కొనసాగిస్తానని చెప్పడం గమనిస్తే, ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి విజయవాడను తాత్కాలిక రాజధానిగా ప్రకటించినప్పటికీ, జంట నగరాలలో స్థిరపడిన ఆంధ్రప్రజలకు అండగా నిలిచేందుకే ఆయన హైదరాబాదును అంటిపెట్టుకొని ఉంటున్నారని భావించవచ్చును.