చంద్రబాబు డిల్లీ పర్యటన ఫలించేనా?

 

ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు ఉదయం డిల్లీకి బయలుదేరి వెళ్ళారు. అంతకుముందు, ఆయన నిన్న తన లేక్ వ్యూ క్యాంప్ ఆఫీసులో వివిధ శాఖల అధికారులతో సమావేశమయ్యి ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారం కోసం కేంద్రంతో చర్చించవలసిన అంశాల గురించి వివరాలను అడిగి తెలుసుకొన్నారు. చంద్రబాబు తన రెండు రోజుల డిల్లీ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సహా వివిధ శాఖల కేంద్రంమంత్రులను కలిసినప్పుడు వారితో ఈ విషయాలు చర్చించి వాటి పరిష్కారం కోసం ప్రయత్నించవచ్చును.

 

ఈరోజు ఆయన ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ, జలవనరుల శాఖా మంత్రి ఉమా భారతి, మానవ వనరుల శాఖా మంత్రి స్మృతీ ఇరానీ తదితరులను కలిసేందుకు వారి అపాయింట్ మెంటు తీసుకొన్నారు. ఈ పర్యటనలో ప్రధానంగా రాష్ట్రానికి ఆర్ధిక సహాయం వ్యవసాయ రుణాల మాఫీపై కేంద్రప్రభుత్వ సహకారం కోరబోతున్నట్లు సమాచారం. పోలవరం ప్రాజెక్టుపై తెలంగాణా ప్రభుత్వం అభ్యంతరాలు చెపుతున్న దృష్ట్యా దానిపై కేంద్రం చేత నిర్దిష్ట ప్రకటన చేయామని ఒత్తిడి చేసే అవకాశం ఉంది. ఇక విద్యుత్ మరియు నదీ జలాల పంపకాలపై తెలంగాణా ప్రభుత్వం వ్యవహార శైలి గురించి కేంద్రానికి పిర్యాదు చేసి ఈ సమస్యను శాశ్విత ప్రాతిపదికన పరిష్కరించేందుకు తగిన ఏర్పాట్లు చేయమని కోరవచ్చును.

 

హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్రం రూ.3000 కోట్లు వెచ్చించిదని, కానీ ఇప్పుడు హైదరాబాదును వదులుకొన్నందున ఆ మొత్తాన్ని తిరిగి తమకు చెల్లించమని కోరబోతున్నట్లు సమాచారం. అదేవిధంగా హైదరాబాదులో నెలకొల్పిన వివిధ ఉన్నత విద్యా, వైద్య, ప్రభుత్వ రంగ సంస్థలను, కొత్తగా నిర్మించే ఆంద్రప్రదేశ్ రాజధానిలో కూడా ఏర్పాటు చేయమని కోరబోతున్నట్లు తెలుస్తోంది.

 

అందువల్ల ఈసారి చంద్రబాబు పర్యటన రాష్ట్రానికి సంబంధించినంతవరకు చాలా కీలకమయిందని చెప్పవచ్చును. ఇప్పటికే రాష్ట్రం ఏర్పడి నెల రోజులు గడిచిపోయింది. కానీ నేటికీ రాష్ట్ర పునర్నిర్మాణం, కొత్త రాజధాని విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. కనుక ఈసారి చంద్రబాబు డిల్లీ పర్యటనలో కేంద్రం నుండి ఏమయినా నిధులు, హామీలు సాధించవలసిన ఆవశ్యకత చాలా ఉంది. ముఖ్యంగా వ్యవసాయ రుణాల మాఫీపై వెంటనే ఒక నిర్ణయం తీసుకోవలసి ఉన్నందున, కేంద్రం నుండి తప్పనిసరిగా భారీ ఆర్ధిక ప్యాకేజి సాధించవలసి ఉంది. లేకుంటే ఆయనకు ప్రతిపక్షాల నుండి విమర్శలు తప్పవు.