రుణాల మాఫీకి మరికొంత గడువు కావాలేమో!

 

తెదేపా నారా లోకేష్ నిన్న మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీ చేసిన అన్ని ఎన్నికల హామీలను తప్పకుండా అమలుచేస్తామని, ఆ విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని అన్నారు. అయితే ఆ హామీలన్నిటినీ అమలుచేయడానికి ఐదేళ్ళ సమయం ఉందని, అయితే ప్రభుత్వం అన్ని హామీలను వీలయినంత త్వరగా అమలు చేసేందుకు చాలా చిత్తశుద్ధితో ప్రయత్నాలు చేస్తోందని అన్నారు. తన తండ్రి చంద్రబాబు అధికారం చేప్పట్టిన నాటి నుండి రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు రోజుకి 20గంటలు పనిచేస్తున్నారని అన్నారు. అయితే వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఈవిషయంలో చాలా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ఎద్దేవా చేసారు. కుమారుడు లోకేష్ మాటలకు కొనసాగింపులా చంద్రబాబు మాట్లాడటం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆయన నిన్న మంత్రివర్గ సమావేశం తరువాత తన సహచర మంత్రులతో మాట్లాడుతూ వ్యవసాయ ఋణాలపై ప్రభుత్వంపై చాలా ఒత్తిడి ఉందని, ప్రయత్నలోపం లేకుండా చేయవలసిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నాని, త్వరలో ప్రధాని మోడీని ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీని కలిసిన తరువాత ఈ అంశంపై స్పష్టత వస్తుందని భావిస్తున్నట్లు ఆయన చెప్పినట్లు సమాచారం. చంద్రబాబు, లోకేష్ చెప్పిన మాటలను బట్టి చూస్తే వ్యవసాయ రుణాల మాఫీ కోసం ప్రభుత్వం వద్ద ఎటువంటి ఉపాయం లేదని, అందువల్ల రుణాల మాఫీకి మరికొంత సమయం పట్టవచ్చని భావించవచ్చును.