తెలంగాణాలో తెదేపా ప్రజాగర్జన రేపే

 

చంద్రబాబు నాయుడు గతేడాది “వస్తున్నా మీ కోసం” పాదయాత్ర తరువాత, మళ్ళీ తెలంగాణాలో పర్యటించలేదు. తుఫాను బాధితులను పరామర్శించడానికి మధ్యలో ఒకసారి మాత్రమే వెళ్ళారు. రాష్ట్ర విభజన అంశంపై పార్టీ అనుసరించిన వైఖరి వల్ల తెలంగాణాలో పర్యటిస్తే రెండు చోట్లా ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశ్యంతోనే బహుశః ఆయన ఇంతవరకు పర్యటించలేదు. అయితే ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణాలు రెండు రాష్ట్రాలుగా విడిపోవడంతో పరిస్థితులు మళ్ళీ సాధారణ స్థితికి చేరుకొంటున్నాయి గనుక ఆయన తెలంగాణాలో పర్యటించనున్నారు.

 

తెలంగాణా రాష్ట్రం దేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడిన తరువాత చంద్రబాబు తొలిసారిగా రేపు (శనివారం) ఖమ్మం జిల్లాలో తెదేపా నిర్వహించే ప్రజా గర్జన బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. తెదేపా-తెలంగాణా నేతలు నామనాగేశ్వర రావు తదితరులు తెలంగాణాలో మొట్టమొదటిసారి జరుగబోతున్న ఈ భారీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు గట్టిగా ప్రయత్నాలు, ఏర్పాట్లు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలో మోటార్ సైకిళ్ళపై ర్యాలీగా బయలుదేరి సభా ప్రాంగణానికి చేరుకొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. బహుశః ఈ సభలో చంద్రబాబు తెలంగాణాలో పార్టీని బలోపేతం చేసేందుకు కీలకమయిన నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉంది. అదే విధంగా తెదేపా అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తానని ఇదివరకే ప్రకటించిన ఆయన దానినే మరో మారు పునరుద్ఘాటించి, ఈ విషయంలో దాగుడు మూతలు ఆడుతున్నకాంగ్రెస్, తెరాసలను ఎండగట్టె ప్రయత్నం చేయవచ్చును. అదేవిధంగా హైదరాబాద్ ను ఏవిధంగా అభివృద్ధి చేసినదీ వివిఅరించి, తెదేపాకే తెలంగాణాను పునర్నిర్మించే సత్తా ఉందనే సందేశం ఈయవచ్చును. ఇక గతంలో పార్టీని విడిచిపెట్టి బయటకు వెళ్ళినవారు మరియు ఇతర పార్టీలకు చెందిన కొందరు నేతలు ఈ సభలో చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరే అవకాశం ఉంది. సభ ముగిసిన తరువాత, చంద్రబాబు పార్టీ నేతలతో సమావేశమవుతారు.