కాంగ్రెస్ కిరణ్ ని ముందుకు తీసుకువస్తోందా

 

శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష నేతయిన చంద్రబాబు నాయుడు మొన్న సోమవారంనాడు సభలో రాష్ట్ర విభజన అంశంపై ప్రసంగించేందుకు సిద్దమయ్యారు. కానీ, ముఖ్యమంత్రి అకస్మాత్తుగా బిల్లుకి వ్యతిరేఖంగా తీర్మానం పెట్టాలని నోటీసు ఇవ్వడంతో, సభ స్థంభించిపోయింది. దానితో చంద్రబాబుకి సభలో మాట్లాడే అవకాశం లేకుండా పోయింది. దానిఅపి ఆగ్రహిస్తూ ఆయన కొన్ని ఆసక్తికరమయిన విషయాలు మాట్లాడారు. అదేవిధంగా కొన్ని ఆసక్తికరమయిన ప్రశ్నలు లేవనెత్తారు.

 

1. సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి మాట్లాడేందుకు అవకాశం ఎందుకు ఈయలేదు?

 

2. ప్రధాన ప్రతిపక్ష నేత హక్కులను కాపాడవలసిన బాధ్యత స్పీకర్ కు లేదా?

 

3. శాసనసభ్యులు సభ నుండి ఇంకా మీడియా పాయింటు కూడా చేరుకోకముందే, డిల్లీ నుండి దిగ్విజయ్ సింగ్ బిల్లుపై చర్చ ముగిసిందని ఏవిధంగా ప్రకటించారు?

 

4. రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తున్నానని చెపుతూ బిల్లుకి వ్యతిరేఖంగా తీర్మానం కూడా చేయించిన ముఖ్యమంత్రి, రాష్ట్ర విభజన కోసం అన్ని ఫైల్స్, వివరాలు పంపమని కేంద్రం కోరినపుదు తిరస్కరించకుండా, ఎప్పటికప్పుడు ఎందుకు పంపించి కేంద్రానికి సహకరించారు?

 

ఇక చంద్రబాబు చెప్పిన ఆసక్తికరమయిన విషయాల కొస్తే, జగన్మోహన్ రెడ్డి సమైక్యవాదిగా ఎదగడానికి ఇంతకాలం సహకరించిన కాంగ్రెస్ అధిష్టానం, ఇప్పుడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఆ కీర్తి కట్టబెట్టాలని ప్రయత్నిస్తోందని అన్నారు. డిల్లీ నుండి వచ్చిన ఆదేశాల ప్రకారమే ముఖ్యమంత్రి తీర్మానం నోటీసు ఇవ్వడం, సభలో కాంగ్రెస్, తెరాస, వైకాపాలు కలగలిసి నాటకమాడి, సభ జరగకుండా అడ్డుపడి గడువు కంటే ముందే చర్చ ముగించేసి చేతులు దులుపుకోన్నారని ఆయన అన్నారు. పార్టీ తయారు చేసిచ్చిన రోడ్ మ్యాప్ ప్రకారమే కిరణ్, బొత్స, దామోదర ముగ్గురూ వ్యవహరించి బిల్లుని సజావుగా వెనక్కి త్రిప్పి పంపుతున్నారని చంద్రబాబు ఆరోపించారు.

 

ఈ మొత్తం వ్యవహారాన్ని వైకాపా వీలయినంత త్వరగా చుట్టబెట్టేయాలని తాపత్రయపడిందని, కానీ వారి ఆంతర్యం బయటపడటంతో మరో కొత్త నాటకం ఆడారని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తున్న ముఖ్యమంత్రి కేంద్రానికి పరోక్షంగా సహకరిస్తున్నపటికీ, ఆయన చేతే సభలో బిల్లుకి వ్యతిరేఖంగా తీర్మానం చేయించడం ద్వారా ఆయనను సీమాంధ్ర ప్రజల దృష్టిలో సమైక్య ఛాంపియన్ గాఎదిగేందుకు కాంగ్రెస్ సహకరించిందని చంద్రబాబు అభిప్రాయం కావచ్చును.

 

బిల్లుపై చర్చ ముగిసిన వెంటనే డిల్లీ నుండి మాట్లాడిన దిగ్విజయ్ సింగ్ “బిల్లుపై చర్చించమని తామే తమ నేతలకు అనుమతి ఇచ్చామని వారు ఆ పనిని సక్రమంగా పూర్తి చేసారని” కితాబు ఇవ్వడం బహుశః అందుకే కావచ్చును.

 

ఇక కాంగ్రెస్ అధిష్టానం జగన్మోహన్ రెడ్డిని వెనక్కి నెట్టి, కిరణ్ కుమార్ రెడ్డిని ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తోందని చంద్రబాబు అనడం చూస్తే కాంగ్రెస్ వ్యూహం మారిందని ఆయన అభిప్రాయపడుతున్నట్లు అనుకోవచ్చును. అదే నిజమయితే జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ కష్టకాలం మొదలవుతుందేమో!