యాత్రా ఫలం దక్కాలంటే...

 

చంద్రబాబు మళ్ళీ వచ్చే నెల ఐదున విజయనగరం నుండి ఆత్మగౌరవ యాత్రకు సిద్దం అవుతున్నారు. ఈ సారి యాత్రలో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో పర్యటించనున్నారు. కొద్ది వారల క్రితం డిల్లీలో సమన్యాయం కోరుతూ నిరాహార దీక్ష చేసారు గనుక, ఆయన రాష్ట్ర విభజనకు అంగీకరిస్తునట్లేనని స్పష్టం అవుతోంది. అందువల్ల కనీసం ఈ సారయినా అయన తన ఆత్మగౌరవ యాత్రలో దైర్యంగా ఇదే విషయాన్ని స్పష్టం చేయగలిగితే, మొదట్లో ప్రజల నుండి కొంత వ్యతిరేఖత ఎదుర్కొని ఇబ్బందిపడవలసివచ్చినప్పటికీ దీర్గ కాలంలో ఆయన పార్టీకి ప్రయోజనం చేకూరే అవకాశాలున్నాయి.

 

దీనివల్ల తెలంగాణా-తెదేపా నేతలు తమ ప్రాంతంలో ఎన్నికలకు ముందే పార్టీని బలపరచుకొనే అవకాశం కలుగుతుంది. రెండు రాష్ట్రాలలోజరిగే ఎన్నికలలో పోటీచేయడానికి తెదేపా ఏర్పాట్లు కూడా మొదలుపెట్టుకోవచ్చును. లేకుంటే ఈ అయోమయంలో పార్టీ రెండు చోట్ల నష్టపోవడం ఖాయం. రాష్ట్ర విభజనకు తమ పార్టీ అనుకూలమానో లేక వ్యతిరేఖమనో ఆయన ఇంతవరకు స్పష్టం చేయనప్పటికీ, తెదేపా విభజనకు అనుకూలమనే సంగతి ఇప్పటికే స్పష్టమయ్యింది గనుక ఆయన ఇంకా ఈ విషయం దాచిపెట్టి వేరేదో మాట్లాడటం వలన పార్టీకి ఒరిగేదేమీ ఉండకపోగా, ప్రజలలో ఆయన విశ్వసనీయత ప్రశ్నార్ధకంగా మారుతుంది.

 

కాంగ్రెస్ నేతలు పురందేశ్వరి, పనబాక, జేడీ శీలం వంటివారు రాష్ట్ర విభజన అనివార్యమని, అందువల్ల సీమాంధ్ర ప్రజలకు, ప్రాంతానికి అత్యుత్తమ ప్యాకేజి సాధించేందుకు కృషి చేస్తామని బహిరంగంగానే చెపుతున్నారు. తద్వారా వారు విమర్శలు మూట గట్టుకొంటున్నపటికీ, ఒకవైపు రాష్ట్ర విభజన ప్రక్రియ చకచకా జరిగిపోతున్నపటికీ ఏమీ చేయకుండా చేతులు ముడుచుకొని కూర్చొని, రాష్ట్ర విభజనను అడ్డుకొంటామని ఉత్తర ప్రగల్భాలు పలుకుతూ ప్రజలను మభ్యపెట్టే నేతల కంటే వీరే నయమనే భావన ప్రజలలో నెలకొంది.

 

అందువల్ల చంద్రబాబు కూడా తన యాత్రలో స్పష్టమయిన వైఖరి ప్రకటించగలిగితే ఆయన పార్టీకి మేలు చేకూరవచ్చును. లేకుంటే రాష్ట్ర విభజన ప్రక్రియను పర్యవేక్షిస్తున్న కేంద్ర మంత్రుల బృందంతో కాంగ్రెస్ నేతలు చర్చలు జరిపి తామే సీమాంధ్ర ప్రజలకు న్యాయం చేయగలిగామని చెప్పుకొంటూ ప్రజల ఓట్లు అడుగుతున్నపుడు, తెదేపా ఇంతకీ తానేమి సాధించిందో చెప్పుకోలేక దిక్కులు చూడవలసిన పరిస్థితి ఏర్పడవచ్చును.

 

అత్యనిష్టూరం కంటే ఆది నిష్టూరం మేలని పెద్దలు ఊరకనే అనలేదని ఆయన ఈ సందర్భంగా గుర్తుంచు కోవాలి. అందువల్ల చంద్రబాబుకి, తెదేపాకి ఈ యాత్రా ఫలం పూర్తిగా దక్కాలంటే మనసులో మాట దైర్యంగా చెప్పెయడమే బెటర్.