చంద్రబాబు ఎంట్రీతో ట్వీటర్ లో రాజకీయ యుద్ధం షురూ

 

ఇంతవరకు చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ ట్వీటర్ లో తమ రాజకీయ ప్రత్యర్ధులపై మంచి సమయ స్పూర్తితో ఘాటయిన విమర్శలు చేస్తూ అందరినీ ఆకట్టుకొంటున్నారు. అయితే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకోవడంలో ఎప్పుడు అందరి కంటే ముందుండే చంద్రబాబు మాత్రం, పని ఒత్తిడి కారణంగా ఇంతకాలం ఈ ట్వీటర్, ఫేస్ బుక్కులోకి ప్రవేశించలేదు. అయితే లేటుగా వచ్చిన లేటెస్ట్ గా వస్తాడన్నట్లు ఇటీవలే ట్వీటర్లో ప్రవేశించిన ఆయన కూడా మంచి ఆసక్తికరమయిన ట్వీట్స్ చేస్తూ ఆకట్టుకొంటున్నారు.

 

రాష్ట్ర విభజనలో ప్రధాన పాత్ర పోషించిన దిగ్విజయ్ సింగ్ గురించి ఈ వ్దిహంగా వ్రాసారు: “మధ్యప్రదేశ్ నుండి తరిమివేయబడిన దిగ్విజయ్ సింగ్ ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆశ్రయం పొందాలని చూస్తూ విభజన రాజకీయాలు చేస్తున్నారు.”

 

చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలకి ఊహించినట్లుగానే మంచి స్పందనే వచ్చింది. అంతే గాక ప్రింట్ మరియు ఎలెక్ట్రానిక్ మీడియా సైతం ఆయన వ్యాఖ్యలపట్ల ఆసక్తి చూపడం విశేషం. అయితే దిగ్విజయ్ సింగ్ వంటి అనేక మంది కాంగ్రెస్ నేతలు ఇప్పటికే ఈ సోషల్ నెట్వర్క్ సైట్లలో తమ రాజకీయ ప్రత్యర్ధులతో పెద్ద యుద్ధం చేస్తున్నారు. ఇప్పుడు వారికి చంద్రబాబు కూడా తోడవడంతో, ఇంతవరకు కాంగ్రెస్-బీజేపీల మధ్యనే జాతీయ స్థాయిలో జరుగుతున ఈ సైబర్ యుద్ధం, దిగ్విజయ్ సింగ్ చంద్రబాబుకి ఇచ్చే జవాబుతో ఇక రాష్ట్ర స్థాయిలో కూడా మొదలవవచ్చును. అయితే రాష్ట్రస్థాయి కాంగ్రెస్ నేతలలో దీనిపట్ల ఆసక్తి, అవగాహన కొరవడటంతో ప్రస్తుతానికి చంద్రబాబుకి ఎదురులేకపోవచ్చును.