చంద్రబాబుకి మోడీ ఫోన్లో పరామర్శ

 

చంద్రబాబు నాయుడు ఐదు రోజులు డిల్లీలో నిరాహార దీక్ష చేసినప్పుడు అక్కడే ఉండే బీజేపీ అగ్రనేతలెవరూ కూడా ఆయనను పరామార్శించడానికి కూడా రాకపోవడం విశేషం. బీజేపీ, తెదేపాల మధ్య ఎన్నికల పొత్తులు ఉండవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్ననేపద్యంలో కూడా బీజేపీ నేతలెవరూ చంద్రబాబుని పరామర్శించడానికి రాకపోవడం వెనుక బీజేపీ తెలంగాణా నేతల ఒత్తిడి ఉన్నట్లు సమాచారం.

 

తెలంగాణా అంశంపై స్పష్టత ఈయని చంద్రబాబుకి సంఘీభావం తెలుపడం వలన, తెలంగాణాలో పార్టీకి ఇబ్బందికరమయిన పరిస్థితి ఎదురవుతుందని వారు అభ్యంతరాలు తెలిపినందునే, బీజేపీ అగ్రనేతలెవరూ కూడా ఆయనను పరామర్శించడానికి వెళ్లలేదని తెలుస్తోంది. అయితే బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీ మాత్రం చంద్రబాబుకి ఫోన్ చేసి మాట్లాడినట్లు తెలుస్తోంది. రెండు పార్టీల మధ్య ఎన్నికల పొత్తుల గురించి ఆలోచించుకోవడానికి ఇంకా చాలా సమయం ఉంది గనుక, ఈలోగా తెలంగాణా ఏర్పాటుపై మరికొంత స్పష్టత ఏర్పడితే అప్పుడు మాట్లాడుకోవడం మేలని రెండు పార్టీలు భావిస్తున్నట్లున్నాయి. తెదేపా బీజేపీలు క్రమంగా దగ్గరవుతున్నందునే, లెఫ్ట్ పార్టీ నేతలెవరూ కూడా ఆయనను పరామర్శించడానికి రాలేదనుకోవచ్చును.