చంద్రబాబు దీక్షతో కాంగ్రెస్ వెనక్కి తగ్గిందా?

 

తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ అధిష్టానం అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ రెండు ప్రాంతాలకు సమ న్యాయం చేయాలని కోరుతూ గత మూడు రోజులుగా డిల్లీలో ఏపీ భవన్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఇంతవరకు సీమంద్రాలో జరుగుతున్న ఉద్యమాలను పెద్దగా పట్టించుకోని జాతీయ పార్టీల నాయకులు మరియు జాతీయ మీడియా ఇప్పుడు చంద్రబాబు దీక్షతో రాష్ట్ర విభజన సమస్యపై దృష్టి పెట్టారు. కాంగ్రెస్ పార్టీ తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని ఎటువంటి దుస్థితి తెచ్చిందో ఆయన వివరిస్తూ, దానివెనుక ఉన్న కాంగ్రెస్ ఎత్తుగడలను వివరిస్తుంటే, త్వరలో డిల్లీతో సహా ఐదురాష్ట్రాలలో ఎన్నికలను ఎదుర్కోనున్న కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు మరిన్ని రోజులు డిల్లీలో ఉంటే ముందుగా అది డిల్లీ ఎన్నికలలో తమ విజయావకాశాలపై ప్రభావం చూపువచ్చునని ఆందోళన చెందుతున్నారు.

 

ఈ సారి ఎట్టి పరిస్థితుల్లో డిల్లీ ఎన్నికలలో తమ పార్టీ గెలవాలని గట్టిగా ప్రయత్నిస్తున్న బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీ కాంగ్రెస్ కు వ్యతిరేఖంగా చేతున్న ప్రచారానికి ఇప్పుడు చంద్రబాబు చెపుతున్న విషయాలు కూడా తోడయితే అది అగ్నికి ఆజ్యం పోసినట్లవుతుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బహుశః నిన్న కాంగ్రెస్ అధికార ప్రతినిధి పీసీ చాకో చేసిన “తెలంగాణపై నాన్పుడు ప్రకటన”కు ఇది కూడా ఒక కారణం కావచ్చును.