రాజకీయ విరోధుల నుండి ప్రేరణ

 

వైకాపా అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి గత 14నెలలుగా చంచల్ గూడా జైలు నుండే తన పార్టీని ఎంతో సమర్ధంగా నడిపిస్తున్నపటికీ, ఆపార్టీ యొక్క రోజువారి కార్యక్రమాలను నిర్వహించడం మాత్రం కొంచెం కష్టంగానే ఉండవచ్చును. ఇక నిరాహార దీక్షలు, ధర్నాలు, పాదయాత్రలు వంటి కార్యక్రమాలను రూపొందించుకోవడంకోసం చంచల్ గూడా జైలుకి పరుగులు తీయడంకంటే నేరుగా తన రాజకీయ ప్రత్యర్ధి తెదేపా కార్యక్రమాలనే అమలు చేయడమే సులువని ఆ పార్టీ భావిస్తున్నట్లుంది.

 

తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు పాదయాత్ర మొదలు పెట్టగానే, వెంటనే షర్మిల కూడా పాదయాత్ర చేప్పట్టారు. మళ్ళీ ఇప్పుడు ఆయన తన పాదయాత్రలో సందర్శించని ప్రాంతాలను బస్సు యాత్ర ద్వారా సందర్శించాలనుకొంటున్నట్లు ప్రకటించగానే, షర్మిల కూడా త్వరలో బస్సుయాత్ర మొదలుపెట్టబోతున్నట్లు వైకాపా ప్రకటించడం గమనార్హం. అయితే, తెదేపా నేతలు కూడా వైకాపా రాజీనామాలను, నిరాహార దీక్షలను, ర్యాలీలను గుడ్డిగా అనుసరించడం విశేషం. ఇంకా చెప్పాలంటే బహుశః చంద్రబాబు కూడా మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర స్పూర్తితోనే తను కూడా పాదయాత్ర చేసి ఉండవచ్చును. ఏమయినప్పటికీ బద్ద విరోధులయిన వైకాపా, తెదేపాలు ఈవిధంగా ఒకరినుండి మరొకరు రాజాకీయ ప్రేరణ పొందడం విడ్డూరమే.