సమైక్యమా? ఇప్పుడు కాదులే...

 

 

ఒకానొకప్పుడు చంద్రబాబు తెలంగాణా లో పాదయత్ర చేస్తున్న సమయంలో నిత్యం ఎవరో ఒకరు తెలంగాణా ఇవ్వాలని మీరు కోరుకొంటున్నారా లేదా? తెలంగాణా పై మీ అభిప్రాయం స్పష్టంగా చెప్పమని, లేకపొతే ‘జై తెలంగాణా’ అనమనో అడుగుతూ ఆయనను ఇబ్బందికర పరిస్థితుల్లో నెట్టేవారు. అప్పుడు ఆయన వారికి లౌక్యంగా సమాధానం చెప్పి బయటపడేవారు.

 

తెలంగాణా అనుకూల నిర్ణయం తీసుకొన్న తరువాత కూడా ఆయన తన పార్టీ వైఖరిని ఇంతవరకు స్పష్టంగా ప్రకటించలేదు. ఎందుకంటే, మరీ కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేస్తే, కాంగ్రెస్ దానిని ఆసరాగా తీసుకొని తన పార్టీని రాజకీయంగా దెబ్బ తీయవచ్చుననే భయంచేత కావచ్చును. లేదా, ఒకవేళ తానూ ‘జై తెలంగాణా’ అన్న తరువాత, కాంగ్రెస్ సమైక్యం అని ప్రకటిస్తే, అప్పుడు రాష్ట్రంలో తన పార్టీ పరిస్థితి దారుణంగా తయారవుతుందనే భయంచేత కావచ్చును. మొత్తం మీద, చంద్రబాబు అటు ‘జై తెలంగాణా’ అని అనలేకా, ఇటు ‘జై సమైక్యాంద్ర’ అని అనలేక చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో పాదయాత్ర సాగిస్తున్నారు.

 

పటిష్టమయిన తన పార్టీ క్యాడర్ల సహాయంతో సమైక్యవాదులను తన పాదయాత్రలకి దూరంగా ఉంచి ముందుకు సాగుతున్న చంద్రబాబు, తెలంగాణాలో తానూ ఎదుర్కొన్న ఇబ్బందులు, ఇక్కడ కోస్తాంధ్రాలో ఇంతవరకు ఎదుర్కోకుండానే ముందుకు సాగిపోతున్నారు. లగడపాటి వంటివారు ఆయనను ఇబ్బందిపెట్టాలని ప్రయత్నించినా పోలీసుల జోక్యంతో ఆ ప్రమాదం కూడా అదిగమించగలిగారు.

 

అయితే, నిన్న గుంటూరు జిల్లా ఉప్పలపాడు గ్రామంలో ఆయన పాదయాత్ర సాగున్నపుడు మాత్రం ఈ ఇబ్బందికర సమస్య మళ్ళీ ఎదుర్కోకతప్పలేదు. గ్రామంలో రైతులతో మాట్లాడుతుండగావారిలో ఒక రైతు చంద్రబాబును ‘జై సమైక్యాంధ్ర’ అనమని కోరాడు. ఇటువంటి సమస్యలను ఇప్పటికే చాలాసార్లు ఎదుర్కొన్న చంద్రబాబు ఆచి తూచి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వైఖరిని ఇప్పటికే చాలాసార్లు చెప్పామని, ఇక దానిపై నిర్ణయం తీసుకోవలసిన బాధ్యత కేంద్రదానిదే తప్ప తమది కాదని ఆయన జవాబు ఇచ్చారు. దీనినే రెండు కళ్ళ సిద్దాంతం అని తెరాస అభిప్రాయపడితే, కర్ర విరగకుండా పాము చావకుండా ప్రమాదం దాటేయడం అని రాజకీయ విశ్లేషకులు అబిప్రాయపడుతున్నారు.