ఈ ఒక్కరోజు దీక్షలతో ఏం సాధిస్తారు సార్...!

 

ఈ మధ్య  రాజకీయ నాయకులకు ఒక్కరోజు నిరాహారదీక్షలు చేయడం.. ఒక్కరోజు పాదయాత్రలు చేయడం ఫ్యాషన్ అయిపోయింది.  ఏపీ ప్రత్యేక హోదా పోరాటంలో భాగంగా ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక్కరోజు పాదయాత్ర చేశారు. అంతేనా ప్రధానమంత్రి మోడీ కూడా ఒక్కరోజు నిరాహార దీక్ష చేశారు. మోడీ ఒక్కరోజు నిరాహార దీక్ష ఎందుకు చేశారో తెలుసుకదా. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏపీ ఎంపీలందరూ పార్లమెంట్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేసిన సంగతి తెలిసిందే. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం కూడా పెట్టారు. ఇక చేయాల్సింది అంతా చేసి కేంద్రం డ్రామాలు ఆడి దానిపై చర్చ జరగకుండా చేసింది. పైగా విపక్షాలు చర్చలు జరగకుండా అడ్డుకున్నాయని... దానిని నిరసిస్తూ ప్రధాని మోడీ దీక్ష చేశారు. ఇక తమిళనాడులో కూడా కావేరి బోర్డు యాజమాన్యం ఏర్పాటు చేయాలని అన్నాడీఎంకే అధ్వర్యంలో నేతలు ఆమరణ నిరాహార దీక్ష చేశారు. అయితే పేరుకే ఆమరణ నిరాహార దీక్ష అని తేలిపోయింది. దీక్ష పేరుతో నేతలు ఎంచక్కా పక్కకు వెళ్లి ఫుల్ గా కుమ్మేయడం కెమెరాల కంటికి చిక్కి పరువు పోవడం అన్నీ జరిగిపోయాయి. ఇక ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఆ జాబితాలో చేరిపోయారు. తాను కూడా నిరాహారదీక్షను చేయబోతున్నానంటూ ప్రకటన చేశారు. తన పుట్టినరోజైన ఏప్రిల్ 20వ తేదీన దీక్షను చేపడుతున్నానని ఆయన తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దీక్ష చేయనున్నట్టు చంద్రబాబు ప్రకటించారు.

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పార్లమెంటును జరగనివ్వలేదని చెప్పి ప్రధాని మోదీ నిరాహారదీక్ష చేశారని... పార్లమెంటు జరగకపోవడానికి కారణం మీరే కదా? అని ఆయనను తాను అడుగుతున్నానని చంద్రబాబు ఎద్దేవా చేశారు. తాను మాత్రం రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ దీక్ష చేయబోతున్నానని... తద్వారా కేంద్రం పట్ల నిరసన వ్యక్తం చేస్తానని తెలిపారు. అంతేకాదు... ఢిల్లీని శాసించబోయేది టీడీపీనే అని... ఢిల్లీలో చక్రం తిప్పుతామని చెప్పారు. 2019లో మనం మద్దతు ఇచ్చే పార్టీనే కేంద్రంలో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో 25 ఎంపీ సీట్లను గెలిపిస్తే... ప్రత్యేక హోదాను తెస్తామని తెలిపారు. తెలుగుదేశం పార్టీ అంటే ఏమిటో యావత్ దేశానికి చూపుదామని అన్నారు. మరి ఈ ఒక్కరోజు దీక్షలు ఏంటో అని సామాన్య ప్రజలు చర్చించుకుంటున్నారు. ఒక్కరోజు దీక్ష చేస్తే ఆ ఎఫెక్ట్ ఎంత వరకూ ఉంటుందో వాళ్లకే తెలియాలి అని అంటున్నారు. అసలు ఏం తినకుండా ఒక్కరోజు ఉండటం పెద్ద మ్యాటరేం కాదు.. అలాంటిది ఒక్కరోజు దీక్ష చేసి ఏం సాధిస్తారో ఏమో అని అసహనం వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం మరి చంద్రబాబు ఒక్కరోజు దీక్షతో సాధిస్తారేమో..!