చంద్రబాబు ప్రధాని అవ్వబోతున్నారా?

 

2019 ఎన్నికల తర్వాత చంద్రబాబు దేశానికి ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు వున్నాయా? దేశ రాజకీయాలను శాశించగల వ్యక్తులు చంద్రబాబు ప్రధానమంత్రి అవ్వాలని కోరుకుంటున్నారా? దీనికి సంబంధించి వ్యూహ రచన ఇప్పటికే ప్రారంభమైందా? తాజాగా జరిగిన పరిణామాలు ఇలాంటి సందేహాలు కలగడానికి కారణమయ్యాయి. రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ మంగళవారం నాడు అమరావతిని సందర్శించారు. అమరావతిలో జరుగుతున్న పరిపాలన కార్యక్రమాలను చూసి ఆయన చంద్రబాబును అభినందించారు. ‘‘చంద్రబాబు లాంటి సమర్థుడైన నాయకుడు ‘‘మరింత పెద్దహోదా’’లో వుంటే అద్భుత ఫలితాలు ఒనగూరుతాయి’’ అని ముకేష్ అంబానీ వ్యాఖ్యానించారు. ముకేష్ అంబానీ భావిస్తున్న ‘‘పెద్ద హోదా’’ ప్రధానమంత్రి పదవేనని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా దేశ రాజకీయాలను శాశించే శక్తి వున్న వ్యక్తి ముకేష్ అంబానీ... ఆయన నోటి వెంట వచ్చిన ఈ మాట ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాలలో చర్చకు దారి తీసింది.

 

చంద్రబాబుకు ప్రధానమంత్రి సీటు మీద కూర్చోవాలన్న కోరిక ఎంతమాత్రం లేదు. గతంలో  ఆయనకు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చింది. అయితే ఆయన ఎగిరి గంతేసి ప్రధాని కుర్చీ మీద కూర్చోలేదు. ఆ ఆఫర్ని సున్నితంగా తిరస్కరించారు. ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేయడమే తనముందు వున్న ఏకైక లక్ష్యమని అప్పట్లో ఆయన ప్రకటించారు. గత నాలుగేళ్ళుగా నవ్యాంధ్రప్రదేశ్‌ని అభివృద్ధి పథంలో నడిపించే పనిలో ఆయన తలమునకలుగా వున్నారు. నిధులు లేని రాష్ట్రం ఏ విషయంలోనూ వెనుకబడకుండా వుండేందుకు ఆయన తన శాయశక్తులా కృషి చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ చేతికి చిప్ప ఇచ్చి హైదరాబాద్ నుంచి తరిమేసిన ఆంధ్రులను గౌరవప్రద స్థానంలో నిలబెట్టడానికి తపిస్తున్నారు. చంద్రబాబు చేస్తున్న ఈ కృషిని గమనించే ముకేష్ అంబానీ చంద్రబాబుకు ‘పెద్ద హోదా’ రావాలని భావించారేమో!

 

2019 ఎన్నికల తర్వాత చంద్రబాబుకు ప్రధానమంత్రి అయ్యే అవకాశం మరోసారి లభిస్తే ఆయన ఈసారి దానిని సున్నితంగా తిరస్కరించరనే భావించవచ్చు. నిజంగానే చంద్రబాబు ఉండాల్సిన స్థాయి ప్రధానమంత్రి స్థాయే. దేశం ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశానికి చంద్రబాబు లాంటి ప్రధానమంత్రి అవసరం ఎంతైనా వుంది. ఈ విషయాన్ని గ్రహించే ముకేష్ అంబానీ తన ఆకాంక్షను వ్యక్తం చేసి వుంటారు. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ రెండూ ఆంధ్రప్రదేశ్‌కి ద్రోహం చేసిన నేపథ్యంలో చంద్రబాబు ప్రధానమంత్రి స్థానాన్ని చేపడితే అది ఆంధ్రప్రదేశ్‌కి ఎంతో మేలు చేసే అంశం అవుతుంది. అందుచేత.. ఈసారి చంద్రబాబు దేశానికి ప్రధానమంత్రి అవ్వాలని కోరుకుందాం.