నిజమైన కార్యకర్తలకు చంద్రబాబు నిరాశను మిగిల్చారా..?

 

దేశవ్యాప్తంగా మరోసారి రాజ్యసభ ఎన్నికల నగారా మోగింది. ఏప్రిల్ మొదటి వారంలో పలువురు రాజ్యసభ సభ్యుల సభ్యత్వం ముగియనుండటంతో ఆయా స్థానాలను భర్తీ చేసేందుకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న బలాన్ని బట్టి టీడీపీకి రెండు రాజ్యసభ స్థానాలు ఖాయంగా లభిస్తాయి. మరోవైపు అభ్యర్థుల ఎంపిక టీడీపీ అధినేతకు కత్తిమీద సాములా తయారైంది. ఆశావహుల జాబితా చాంతాడంత ఉండటంతో పాటు.. ఒకరికి ఛాన్స్ ఇస్తే.. రెండో వారి నుంచి ఎలాంటి నిరసన వస్తుందోనని ఆయన భయపడుతున్నారు. అయితే రెండు రాజ్యసభ స్థానాల్లో ఒకదానికి అభ్యర్థి ఎప్పుడో ఖరారైపోయాడంటూ విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.

 

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ప్రముఖ పారిశ్రామిక వేత్త మెగా కనస్ట్రక్షన్స్ అధినేత మెగా కృష్ణారెడ్డికి రాజ్యసభ టికెట్ దక్కబోతుందంటూ జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భారీ ప్రాజెక్ట్‌లన్నీ ఈయనవే. మీరే మా పని చేసి పెట్టాలంటూ అటు ఏపీ, ఇటు తెలంగాణ ప్రభుత్వాలు మెగా కృష్ణారెడ్డికి రెడ్‌ కార్పెట్ పరుస్తున్నాయి. నిజానికి మెగా కృష్ణారెడ్డి వైఎస్‌కు అత్యంత సన్నిహితుడు.. అలాగే కేవీపీ రామచంద్రరావుకు పార్ట్‌నర్‌‌గా పేరుంది. వైఎస్ జమానాలో ఆయన పెద్ద ఎత్తున కాంట్రాక్టులు చేపట్టారు. అప్పట్లో ఈ సంస్థ అవినీతిపై ప్రతిపక్షనేతగా ఉన్న చంద్రబాబు తీవ్ర ఆరోపణలు చేశారు.

 

అలాంటిది తెరవెనుక ఏం జరిగిందో తెలియదు కానీ.. ఇప్పుడు మాత్రం పిలిచి మరీ ప్రాజెక్ట్‌లు కట్టబెడుతున్నారు. నిన్నటి వరకు కాంట్రాక్టర్‌.. ముఖ్యమంత్రిగా ఉన్న వీరి బంధం.. ఇప్పుడు పార్టీ కార్యకర్త.. పార్టీ అధినేతగా మారింది. మెగా కృష్ణారెడ్డిని స్వయంగా సీఎం రమేశే ముఖ్యమంత్రికి పరిచయం చేశాడట. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య మాంచి సాన్నిహిత్యం కుదిరిందట. అదే ఇప్పుడు కృష్ణారెడ్డిని రాజ్యసభకు ఎంపిక చేసేలా చేసిందంటూ టీడీపీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. దానికి తోడు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు సమర్థవంతమైన పాలనను అందిస్తున్నా.. ఎన్నికల రణరంగంలోకి దిగాలంటే డబ్బు కావాల్సిందే. ఎన్నికల ఖర్చులు విపరీతంగా పెరిగిపోయిన ప్రస్తుత రోజుల్లో ఆర్థికంగా పుష్టి కలిగిన వారికే పార్టీ అధిష్టానాలు రెడ్ కార్పెట్ పరుస్తున్నాయి.

 

దశాబ్ధాలుగా పార్టీ జెండా మోస్తూ.. ప్రత్యర్థుల దాడుల్ని తట్టుకుంటూ నిలబడిన వారికి అధినేతలు మొండి చేయి చూపించక తప్పడం లేదు. ఇది వారు కావాలని చేస్తున్నది కాదు.. పార్టీ మనుగడ కోసం ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పని పరిస్థితి. ఇప్పుడు ఇదే దారిలో మెగా కృష్ణారెడ్డికి ఛాన్స్‌ దక్కబోతుందా అంటున్నారు విశ్లేషకులు. అర్థబలం, అంగ బలం మెండుగా ఉండటంతో పాటు సామాజిక వర్గ లెక్కల ప్రకారం మెగా కృష్ణారెడ్డికి చంద్రబాబు పట్టం కట్టబోతున్నారని.. మరికొద్ది రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడుతుందని ప్రచారం జరుగుతోంది. కానీ గత ఎన్నికల్లో అవకాశం రాని ఎంతోమంది రాజ్యసభ టికెట్ మీద గంపెడు ఆశ పెట్టుకున్నారు. అధినేత తమను కనికరించకపోతారా అన్న నమ్మకంతో ఉన్నారు.. ఇలాంటి వారందరికి చంద్రబాబు నిర్ణయం శరాఘాతంలా తాగిలింది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక తాను పరిచయం చేసిన "మెగా".. ఇప్పుడు తన పదవికే ఎసరు పెడతాడా అని సీఎం రమేశ్ లోలోపల భయపడుతున్నారట. మరి వీరికి టీడీపీ అధినేత ఎలాంటి సమాధానం చెబుతారో వేచి చూడాలి.