TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చంద్రబాబు విమర్శలకు కాంగ్రెస్ పార్టీలో జవాబు చెప్పేవారున్నారా?

Published on: Sun Dec 29, 2013 7:50PM

 

తెలుగుదేశం పార్టీ తిరుపతి నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ మైదానంలో ఆదివారం నిర్వహించిన ప్రజా గర్జన సభలో ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీలో సోనియాగాంధీపై నిప్పులు చెరిగారు. ఆమెను ఆదరించిన దేశ ప్రజలను, రాష్ట్ర ప్రజలను చివరికి స్వంత పార్టీ నేతలను కూడా ఆమె వంచించారని, సోనియాగాంధీని ప్రజలు ఆదరిస్తే, ఆమె పెద్దపెద్ద అనకొండ పాముల వంటి కాంగ్రెస్ నాయకులను తయారుచేసి దేశం మీదకి వదిలిపెట్టిందని, వాటిలో ఒకటి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి కాగా, ఆయన కూడా పోతూపోతూ తన ఇంట్లో మరొక అనకొండవంటి జగన్మోహన్ రెడ్డిని తయారుచేసి రాష్ట్రం మీదకు వదిలాడని ఎద్దేవా చేసారు.

 

తన హయంలో చేసిన అభివృద్ధి ఫలాలను ఈ కాంగ్రెస్ అనకొండలన్నీ స్వాహా చేసేస్తున్నాయని వాటిని ఎదుర్కోవడానికి ప్రతి ఒక్కరు ఒక బొబ్బిలి పులిగా, ఒక మేజర్ చంద్రకాంత్‌గా, కొండవీటి సింహాలుగా ఎదుర్కోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.” చంద్రబాబు ఆవిధంగా స్వర్గీయ నందమూరి వారి సినిమాల పేర్లను పలకడంతో ప్రజల నుండి మంచి స్పందన వచ్చింది.

 

చంద్రబాబు ప్రసంగాలలో రాన్రాను కాంగ్రెస్, సోనియాగాంధీ, జగన్మోహన్ రెడ్డిలపై విమర్శలు పదునెక్కుతున్నాయి. బహుశః ఎన్నికల సమాయం దగ్గిర పడుతున్న కొద్దీ అవి మరింత వాడివేడిగా ఉండవచ్చును. డిల్లీలో అమాద్మీ చేతిలో కాంగ్రెస్ ఓడిపోవడాన్నిఆయన ప్రస్తావిస్తూ, ప్రజలు అవినీతికి మారుపేరయిని కాంగ్రెస్ పార్టీని తిరస్కరించారని, ఇప్పుడు దేశంలో ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పాలనకు స్వస్తి పలికేందుకు ఎదురుచూస్తున్నారని ఆన్నారు.

 

గత తొమ్మిదేళ్లుగా దేశంలో నానాటి పెరుగుతున్నఅవినీతి కానీ, అధిక ధరలు గానీ రాహుల్ గాంధీకి గుర్తుకు రాలేదని, ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఆయన కూడా వాటి గురించి మాట్లాడుతూ, ప్రజలను మభ్యపెట్టి మళ్ళీ అధికారంలోకి రావాలని పగటికలలు కంటున్నారని నిశితంగా విమర్శించారు.

 

కాంగ్రెస్ పార్టీ ప్రతీసారి తన ప్రతిపక్ష పార్టీలకోసం గొయ్యి త్రవ్వడం, అందులో మళ్ళీ తానే పడుతుండటం కూడా ఒక ఆనవాయితీగా మారిపోయిందని, తెదేపాను దెబ్బతీయాలనే దురాలోచనతో రాష్ట్ర విభజనకు పూనుకొని ఇప్పుడు తనే ఘోరంగా దెబ్బ తినబోతోందని చంద్రబాబు అన్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రజలే కాక, స్వయంగా కాంగ్రెస్ నేతలే పార్టీని వ్యతిరేఖిస్తున్నారని, ఓటమి భయంతో అందరూ చల్లాచెదురయిపోతున్నారని ఆయన ఎద్దేవా చేసారు.

 

తొమ్మిదేళ్ళ కాంగ్రెస్ పాలనలో అస్తవ్యస్తంగా మారిన రాష్ట్ర పరిస్థితి చక్కబడాలంటే, మళ్ళీ తేదేపాకు ఓటేసి గెలిపించాలని, తమ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే, ఈ పరిస్థితిని చక్కదిద్దడమే కాకుండా మళ్ళీ రాష్ట్రాని పునర్వైభవం తప్పక తీసుకువస్తానని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఆయన తన ప్రసంగంలో ఒకపక్క కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ఏవిధంగా నాశనం చేసింది సోదాహరణంగా వివరిస్తూనే, తమ హయాంలో చేసిన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించడంతో, కాంగ్రెస్-తెదేపా- పాలనలోగల తేడాను స్పష్టంగా ప్రజల కళ్ళకు కట్టినట్లు చూపగలిగారు.

 

గతంలో ఎవరయినా కాంగ్రెస్ పార్టీపై, సోనియాగాంధీపై ఇంత తీవ్ర విమర్శలు చేసినట్లయితే రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలందరూ వారిపై మూకుమ్మడిగా ఎదురుదాడికి దిగేవారు. కానీ ఇప్పుడు ఆ విమర్శలను ఎదుర్కొనే వారే లేకుండాపోయారు. ఇది రాష్ట్రంలో కాంగ్రెస్ దయనీయమయిన పరిస్థితికి అద్దం పడుతోంది. అందుకే కాంగ్రెస్ పార్టీ తను తీసుకొన్నగోతిలో తనే పడిందని చంద్రబాబు ఎద్దేవా చేసారు. బహుశః నేడో, రేపో పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణ, సోనియాగాంధీకి నిత్యం భజనచేసే వీ.హనుమంత రావు వంటి వారో ఒకరిద్దరు మీడియా ముందుకు వచ్చి ఖండిస్తారేమో!