తెలుగుదేశానికి కాంగ్రెస్ ఎసరు?

 

 

 

 

అఖిలపక్ష సమావేశంలో తెలుగుదేశం పార్టీ తెలంగాణాకి అనుకూలంగా నిర్ణయం తీసుకొన్న తరువాత ఆ పార్టీకి తెలంగాణాలో మళ్ళీ జనాధారణ లభించడం, బాబు పాదయాత్ర వల్ల తెలుగుదేశం పార్టీ మళ్ళీ తెలంగాణాలో పుంజుకోవడం చూసిన కాంగ్రెస్ పార్టీ చాలా ఆందోళన చెందింది. బాబు నిర్ణయానికి పార్టీకి చెందిన సీమంద్రా నేతల్లోకూడా పెద్ద వ్యతిరేఖత రాకపోవడం, కాంగ్రెస్ పార్టీని మరింత కలవరపరిచింది. బాబు తన నిర్ణయంతో ఒకవైపు తెలంగాణాలో పాగా వేయడమే గాకుండా, మరో వైపు సీమంద్రాలో కూడా తనకి ఎదురుగాలి వీచకుండా పార్టీ నేతలని, శ్రేణులని అనుకూలంగా మలుచుకోవడం కాంగ్రెస్ పార్టీకి పైకి చెప్పుకోలేని కడుపుమంటగా మారింది.

 

చంద్రబాబుకి తెలంగాణాలో తప్పకుండా ఎదురుదెబ్బఖాయం అనుకొన్న కాంగ్రెస్ పార్టీ అంచనాలు తల క్రిందులు చేస్తూ బాబు తెలంగాణాలో దిగ్విజయంగా పాదయాత్ర ముగించుకోవడమే గాకుండా, అదే ఊపుతో నేడు ఆంధ్రా ప్రాంతంలో ప్రవేశించబోతున్నారు. తెలంగాణాలో ఆయనని అడ్డుకునేందుకు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలుగానీ పార్టీకి సహకరించకపోవడంతో, ఆంధ్రా ప్రాంతంలోనయినా అడ్డుకొని అయన జోరుకి బ్రేకులు వేయకపోతే, ఇప్పటికే దారుణంగా ఉన్న పార్టీ పరిస్థితి, బాబు పాదయాత్రతో మరింత దారుణంగా మారుతుందని గ్రహించిన కాంగ్రెస్, లగడపాటి రూపంలో పావులు కదిపి సమైక్యాంద్రా సెంటిమెంటుతో తెలుగుదేశాన్ని నిట్టనిలువునా చీల్చాలని ప్రయత్నాలు ఆరంబించింది.

 

తెలుగుదేశం పార్టీలో సమైక్యవాదులను రెచ్చ గొట్టగలిగితే అది పార్టీలో చీలిక తేవడమేగాకుండా చంద్రబాబుపై ఒత్తిడి పెంచి అతనిని తెలంగాణా మద్దతుపై మరో మాట మాట్లాడేలా చేస్తుందని, తద్వారా తెలంగాణాలో చంద్రబాబు పునర్నిర్మించిన తెలుగుదేశం పార్టీని నాశనం చేయడమే గాకుండా, ఇటు ఆంధ్రా ప్రాంతంలో పార్టీని నిట్టనిలువుగా చీల్చవచ్చని కాంగ్రెస్ కుటిల పధకం పన్నింది.

 

ఆ ప్రయత్నంలో భాగంగానే, ఈ రోజు జగ్గయ్యపేట మండలం గరికపాడు వద్ద కృష్ణా జిల్లాలో ప్రవేశించనున్న చంద్రబాబును అడ్డుకోవడానికి విజయవాడ కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ‘కనువిప్పు యాత్ర’ ప్రకటించారు. చంద్రబాబుకి ఇకనయినా కనువిప్పు కలగాలని కోరుతూ ఆయనకు పుష్పగుచ్చాలు ఇచ్చి గాంధీగిరి చేస్తామని అయన ప్రకటించారు.

 

అయితే, కృష్ణా జిల్లాలో తెలుగు తమ్ముళ్ళు చంద్రబాబుకు మద్దతుగా నిలవాలనుకోవడంతో కాంగ్రెస్ ఇరకాటంలో పడింది. స్థానిక నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తమ నాయకుడికి ఘనస్వాగతం ఇచ్చేందుకు జగ్గయ్యపేటలో ఏర్పాట్లు చేసుకొని చంద్రబాబు కోసం ఎదురుచూస్తున్నారు.

 

ఒకవైపు నిన్న కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన రాహుల్ గాంధీ ఇటువంటి కుళ్ళు రాజకీయాలను నిరసిస్తూ,పార్టీ నేతలు తమ తీరు మార్చుకోవాలని ఉద్బోదించినా, తమ పద్దతులు, అలవాట్లు, ఆలోచనలు అంతతేలికగా మారేవికావని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నిరూపిస్తోంది.