కేంద్రంపై ఒత్తిడి తెద్దాం.. చంద్రబాబు

 

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కేంద్రం మీద ఒత్తిడి తేవలసిన అవసరం వుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీడీపీ ఎంపీలకు సూచించారు. చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశం శనివారం నాడు జరిగింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన విధానంపై ఎంపీలతో చంద్రబాబు చర్చించి దిశా నిర్దేశం చేశారు. విభజన చట్టంలోని హామీల సాధనకు కృషి చేయాలని చంద్రబాబు ఎంపీలకు సూచించారు. రాష్ట్రానికి రావలసిన నిధులు, ప్యాకేజీలు రాబట్టుకోవడానికి ప్రయత్నిచాలని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరారు. నిరంతరం కేంద్ర మంత్రులతో చర్చలు జరిపి నిధులు రాబట్టాలని చెప్పారు. మోడీ ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని, దేశ ప్రయోజనాలను దృష్టిలో వుంచుకోవాలని ఎంపీలకు చంద్రబాబు సూచించారు. తుఫాను బాధిత ప్రాంతాల్లో గృహ నిర్మాణాలకు ఒక్కో ఎంపీ కోటి రూపాయల నిధులు ఇవ్వాలని కోరారు. ఎంపీలు 24 కోట్లు ఇస్తే ప్రభుత్వం మరో 24 కోట్లు ఇస్తుందని తెలిపారు. ఈ నిధులతో గృహ నిర్మాణం పూర్తి చేస్తామన్నారు.