TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వచ్చే దసరాకి... బాబు పెట్టుకున్న టార్గెట్ ఏంటి?

Published on: Mon Oct 10, 2016 2:12PM

  

దసరా అంటే దేశం మొత్తానికీ పండగే! ఓ చోట దాండియా అడితే మరో చోట బతుకమ్మ ఆడుతూ సంబరాలకు సిద్ధపడతారు! ఇక ఓ చోట రామ్ లీల నిర్వహించి రావణ దహనం చేస్తే మరో చోట దుర్గామాత ఊరేగింపులు జరుపుతూ జై మాతా దీ అని గర్జిస్తుంటారు! అందుకే, విజయదశమి యావత్ దేశాన్ని తన్మయం చేసే పర్వం... 
మొత్తం దేశానికి ఎంతో ప్రధానమై దసరా తెలుగు వారికి కూడా చాలా ప్రత్యేకమే. మరీ ముఖ్యంగా గతేడాది విజయదశమి, ఈసారి విజయదశమి... నవ్యాంధ్రకి మరింత ప్రత్యేకం. ఎందుకంటే, పోయిన సంవత్సరం ఇదే పండగ వేళ అమరావతి శంఖుస్థాపన జరిగింది. మోదీ వచ్చి ఆంధ్రుల ఆనంద కోలాహలం మధ్య పనుల్ని ప్రారంభించారు. సరిగ్గా సంవత్సరం తిరిగే సరికల్లా చంద్రబాబు అమరావతిలోనే మకాం చేసి పూర్తి స్థాయిలో పని చేసేట్టుగా ఏర్పాట్లు పూర్తి చేయించారు! ఆయన ఈ విజయదశమి నుంచీ ఏపీ తాత్కాలిక సెక్రటేరియట్ నుంచి ఫుల్ టైం వర్క్ చేయనున్నారు... 
విజయదశమి సందర్భంగా ప్రజలకు బహిరంగ లేఖ రాశారు సీఎం. వచ్చే దసరా నాటికి అమరావతి అద్భుతంగా ఆవిష్కృతం అవుతుందని ఆయన భరోసా ఇచ్చారు. అంతే కాదు, దుర్గమ్మ ఆశీస్సులు, కృస్ణమ్మ పరవళ్లు రాజధానికి తిరుగులేని బలం అన్నారు. వాటితోనే అమరావతి సుసాధ్యం చేసి చూపిస్తానని అన్నారు... 
ప్రపంచపు అయిదు అత్యుత్తమ నగరాల్లో అమరావతి ఒకటిగా వుండబోతుందని చెప్పారు సీఎం. అయితే, అంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిచబోతున్న మహానగరం మామూలు విషయం కాదని కూడా ఆయన అన్నారు. విభజన ఆదరాబాదరాగా చేసేయటంతో ఆంద్రులకి తీరని నష్టం జరిగిందని అంటూనే అన్ని కష్టాల్ని ఎదుర్కొని బయటపడతామని భరోసా ఇచ్చారు. ఆ లక్షణం తెలుగు వారికి వుందని బాబు అన్నారు. 
వేల ఎకరాల భూముల్ని ప్రభుత్వానికి స్వచ్ఛందంగా ఇచ్చిన రైతులకి ధన్యవాదాలు చెప్పిన చంద్రబాబు అమరావతి ఏర్పాటులోని ఛాలెంజెస్ ని లోతుగా చర్చించారు లేఖలో. మౌలిక సదుపాయాల కల్పన కీలకమన్నారు. అలాగే, పోలవరం పూర్తి చేయటం, రైతులకి, జనాలకి నీళ్లు అందివ్వటం తమ ప్రధాన లక్ష్యమన్నారు. విద్యుత్ ఉత్పాదన మీద కూడా తమ దృష్టి వుంటుందని తేల్చారు. ఇక యువత ఉపాధికి ఎంతో కీలకమైన పారిశ్రామిక పురోగతికి కూడా ఆయన పెద్ద పీట వేశారు. ఖచ్చితంగా కేంద్రం సాయంతో ఆంద్రప్రదేశ్ పారిశ్రామికంగా దూసుకుపోతుందని విశ్వాసం వ్యక్తం చేశారు... 
దసరా సందర్భంగా చంద్రబాబు జనానికి రాసిన లేఖ ఒక విధంగా ఆయన రోడ్ మ్యాప్ అనుకోవాలి. 2019లోపు సీఎం చెప్పిన అన్ని పనులూ పూర్తైతే అమరావతి అపురూపంగా ఆంధ్రులకి అందుబాటులోకి వస్తుంది. అది చేయగలిగితే నవ్యాంధ్ర తొలి సీఎంగా... నిస్సందేహంగా, చంద్రబాబు చరిత్రలో నిలిచిపోతారు... ఆంధ్రుల మనస్సుల్లో కూడా!