కాంగ్రెస్ పార్టీకి పాలన చేత కాదు: చంద్రబాబు

 

మునిసిపల్ ఎన్నికల విషయంలో హైకోర్టు కలుగజేసుకోదని తేల్చి చెప్పడంతో ఇక ఎన్నికలు అనివార్యమయ్యాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఇటువంటి అగ్ని పరీక్షలు ఎదుర్కోవడం ఏ పార్టీకయినా ఇబ్బందే. ఎన్నికలలో ఓడిపోతే ఆ ప్రభావం తరువాత వచ్చే ఎన్నికలపై పడుతుంది గనుక అధికారంలో ఉన్న పార్టీకయితే మరీ ఇబ్బంది. అయినా ఎదుర్కోక తప్పడం లేదు. కోర్టులు చేత మొట్టికాయలు వేయించుకొంటే తప్ప మునిసిపల్ ఎన్నికలను కూడా నిర్వహించలేని దుస్థితిలో కాంగ్రెస్ ఉందని చంద్రబాబు ఎద్దేవా చేసారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అధికారం కట్టబెట్టినా అది పూర్తి కాలం సుస్థిరంగా పాలించలేదని రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విదించడంతో అది మరోమారు స్పష్టమయిందని చంద్రబాబు విమర్శించారు. ఆయన కాంగ్రెస్ హయాంలో పెరిగిన ధరలను, అదుపు తప్పిన పాలనను ఎత్తి చూపుతూ, ఒకప్పుడు దేశంలోనే అగ్ర స్థానంలో నిలిచిన రాష్ట్రాన్ని, హైదరాబాదుని కాంగ్రెస్ ప్రభుత్వం తన అవినీతి, అసమర్ధ పాలన కారణంగా అట్టడుగు స్థానానికి చేర్చి చేతులు దులుపుకొని వెళ్లిపోతోందని ఆయన కాంగ్రెస్ పార్టీని దుయ్యబట్టారు. గాడి తప్పిన రాష్ట్రాన్ని మళ్ళీ పట్టాల మీదకు ఎక్కించాలంటే ఒక్క తెలుగుదేశం పార్టీ వల్లనే సాధ్యమవుతుందని ఆయన అన్నారు.

 

చంద్రబాబు కాంగ్రెస్ పార్టీపై ఈవిధంగా దాడి చేయడం కొత్తేమీ కాకపోయినా, కేవలం కాంగ్రెస్ అసమర్ధత కారణంగానే రాష్ట్రంలో మళ్ళీ నలబై ఒక్క ఏళ్ల తరువాత రాష్ట్రపతి పాలన విదించబడిన నేపధ్యంలో ఆయన చేస్తున్న ఆరోపణలు, విమర్శలు వాస్తవ పరిస్థితులకి అద్దం పడుతున్నాయి గనుక ఆయన విమర్శలకు కాంగ్రెస్ పార్టీ జవాబు చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడి ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారాయి.