కోర్టు ఒకే అంటే బాబును బయటకి పంపుతాము:షిండే

 

రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం యొక్క అనుచిత వైఖరిని నిరసిస్తూ రెండు ప్రాంతాలకు సమ న్యాయం చేయాలంటూ తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు డిల్లీలో ఏపీ భవన్లో గత నాలుగు రోజులుగా చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షతో కలవర పడుతున్న కాంగ్రెస్ పార్టీ, ఆయనను వీలయినంత త్వరగా అక్కడి నుండి బయటకి పంపేయాలని ప్రయత్నిస్తోంది. ఏపీ భవన్ రెసిడెంట్ కమీషనర్ శశాంక్ గోయల్ చంద్రబాబుని ఖాళీ చేయమని నోటీసులు కూడా జారీ చేసారు. అయితే కేంద్రం దిగివచ్చేవరకు తాను డిల్లీ నుండి కదలబోనని ప్రతిజ్ఞ చేసిన చంద్రబాబు ఏపీ భవన్లోనే తన దీక్షను కొనసాగిస్తున్నారు.

 

ఈ విషయాన్నీ శశాంక్ గోయల్ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయడంతో, ప్రభుత్వం హోం శాఖకు ఒకలేఖ వ్రాసింది. దానిపై హోంమంత్రి సుషీల్ కుమార్ షిండే స్పందిస్తూ “ఇటువంటి దీక్షలు తానెన్నడూ చూడలేదని” అని అన్నారు. ఇప్పటికయినా చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ తమ దీక్షలు విరమించి మంత్రుల బృందంతో చర్చలకు రావాలని ఆయన హితవు పలికారు.

 

చంద్రబాబును ఏపీ భవన్ నుండి ఖాళీ చేయించడానికి అధికారులు సివిల్ కోర్టు నుండి ఆదేశాలు తీసుకు వచ్చినట్లయితే, తను పోలీసులకు తగిన ఆదేశాలు జారీ చేయగలనని ఆయన తెలిపారు. కానీ వారు చంద్రబాబును బలవంతంగా ఖాళీ చేయించడానికి ప్రయత్నిస్తే అది ఆయనకు మరింత ప్రచారం కలిగించే అవకాశం ఉంది గనుక, ఇక నేడో రేపో ఆయన దీక్షను భగ్నం చేసి ఆసుపత్రికి తరలించవచ్చును.