బాబు వచ్చారు… జాబులొచ్చే టైం కూడా వచ్చేసింది!

 

జగన్ చంద్రబాబుని టార్గెట్ చేయటం… టీడీపీ నేతలు జగన్ని కడిగిపారేయటం… మధ్యలో టీడీపీ, బీజేపీ నేతలు కూడా మాటల తూటాలు పేల్చుకోవటం… ఇదంతా రోజూ వుండే రాజకీయమే! కాని, నిజంగా ఆంధ్రా జనానికి ఏం కావాలి? ఉద్యోగాలు! అవును… హైద్రాబాద్ లేని నవ్యాంధ్ర ఉద్యోగాల లోటుతో సతమతం అవుతోంది. పెట్టుబడుల కోసం ఎదురుచూస్తోంది. అందుకే, స్వయంగా సీఎం చంద్రబాబే ఈ మధ్య అమెరికాలో పర్యటించి పెట్టుబడులు రాబట్టే ప్రయత్నం చేశారు. కాని, ఇంతకీ గ్రౌండ్ లెవల్లో… బాబు వస్తే జాబు వస్తుందన్న నినాదం ఎంత వరకూ వర్కవుట్ అవుతోంది?

 

ప్రతీ నేతా ఎన్నికలప్పుడు జాబులు గ్యారెంటీ అంటూ మాటిస్తారు. కాని, ఇప్పుడు ప్రపంచం వున్న పరిస్థితుల్లో కొత్త ఉద్యోగాల కల్పన అత్యంత కష్టంగా మారిపోయింది. అదే చంద్రబాబుకు కూడా సవాల్ గా మారింది. కాని, జరుగుతోన్న అభివృద్ధి చూస్తోంటే వచ్చే ఎన్నికల నాటికి చాలా మంది ఆంధ్రా నిరుద్యోగుల ముఖం మీద నవ్వు తాండవించే అవకాశం వుందనిపిస్తోంది. అందుక్కారణం… రాబోయే కొన్ని నెలల్లో జరగను్న పరిణామాలే!

 

ఆగస్ట్ నెలలో కర్నూల్ లో మెగా ఫుడ్ పార్క్ కు శంఖుస్థాపన చేస్తారని తెలుస్తోంది. అమెరికాలోని అయోవా యూనివర్సిటీ సాంకేతిక సాయంతో ఈ ఫుడ్ పార్క్ నెలకొల్పబోతున్నారు. ఇది ఖచ్చితంగా కొత్త ఉద్యోగాలు కల్పించే భారీ ప్రాజెక్ట్. వెనుకబడ్డ రాయలసీమకే చెందిన మరో జిల్లా అనంతపురం. ఇక్కడ జూలైలో కియ మోటర్స్ యూనిట్ కు శంఖుస్థాపన జరగనున్నట్టు సమాచారం. ఇది కూడా నిరుద్యోగులకు మంచి చేసే ప్రాజెక్టే! ఇక హైద్రాబాద్ లో ఐటీ వృక్షానికి నారు,నీరు పోసి మహావృక్షంగా మార్చిన చంద్రబాబు నవ్యాంధ్రలో కూడా ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో పెట్టుబడులపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ఆయన కృషి ఫలితంగా త్వరలోనే ఎనిమిది ఐటీ కంపెనీలు ఆంధ్ర రాష్ట్రంలో కార్యకలాపాలు ప్రారంభించనున్నాయి. అలాగే, మరో 25 ఐటీ కంపెనీలు కూడా తిరుపతి, విశాఖా నగరాలకి త్వరలోనే రానున్నాయట!

 

లోకేష్ మంత్రిగా వున్న ఐటీ శాఖపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టినట్టే కనిపిస్తోంది. గత అయిదు నెలల్లోనే 90వరకూ ఐటీ కంపెనీలు ఏపీలో తమ పని ప్రారంభించాయి. 550కోట్లకు పైగా పెట్టుబడులు వీటి ద్వారా రాష్ట్రానికి వచ్చాయి. అయితే, ఇలాంటి లెక్కలు పేపర్లపైన అద్బుతంగా వుంటాయి. చంద్రబాబు సర్కార్ వాటి ఫలితాల్ని సామాన్య జనం దాకా జాగ్రత్తగా చేరిస్తే వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ టెన్షన్ ఫ్రీగా వుండవచ్చు. ఎందుకంటే, గతంలో కులం, మతం పోషించిన పాత్ర కంటే ఎక్కువ ప్రభావం ఇప్పుడు అభివృద్ధి, ఉద్యోగాల కల్పన చూపిస్తున్నాయి ఓటింగ్ టైంలో. ఆ విషయం సీఎం చంద్రబాబుకి తెలియంది కాదు…