చందాకొచ్చర్ రాజీనామా..? నష్టాల్లో షేర్లు..

 

వీడియోకాన్ గ్రూపునకు 2012లో అక్రమంగా రూ.3,250 కోట్ల రుణాన్ని మంజూరు చేసి క్విడ్ ప్రోకోకు పాల్పడినట్లు ఐసీఐసీఐ సీఈవో చందాకొచ్చర్ పై ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె పదవికీ గండం తప్పదా అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. ఐసీఐసీఐ బ్యాంకు సీఈవోగా చందా కొచర్ పదవీ కాలం వచ్చే ఏడాది మార్చి వరకు ఉంది. కానీ వచ్చిన ఆరోపణల నేపథ్యంలో  చందా కొచ్చర్ తన పదవికి రాజీనామా చేయాలని ఐసీఐసీఐ బ్యాంకు బోర్డు నుంచి ఒత్తిడి పెరుగుతోంది. అయితే రుణం మంజూరులో చందాకొచర్ ప్రమేయం ఏదీ లేదంటూ ఇటీవలే బ్యాంకు బోర్డు ఆమెకు మద్దతుగా నిలిచింది.  బోర్డులో కొందరు ఆమె తప్పుకుంటే బావుంటుందని కోరుతుంటే, మరికొందరు ఆమె కొనసాగాలని ఆశిస్తున్నట్టు సమాచారం వినిపిస్తోంది. దీంతో ఆమె తన పదవికి రాజీనామా చేసే అవకాశాలున్నాయంటున్నారు. ఇదిలా ఉండగా కొచర్‌ రాజీనామా వార్తలతో, ఈ బ్యాంకు షేర్లు నష్టాల్లో నడుస్తున్నాయి. ఒకవేళ సీఈవోగా చందా కొచర్‌ రాజీనామా చేస్తే, షేర్లు మరింత కిందకి దిగజారనున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.


కాగా  ఐసీఐసీఐ బ్యాంకును ప్రైవేటు రంగంలో నంబర్ 2 బ్యాంకుగా నిలబెట్టడంలో చందాకొచర్ పాత్ర ఎంతో విలువైనది. సంస్థలో మూడు దశాబ్దాలుగా ఆమె పనిచేస్తున్నారు. ప్రపంచంలోనే శక్తిమంతమైన మహిళల్లో ఒకరిగా ఆమె ఎన్నో పర్యాయాలు గుర్తింపు పొందారు.