జగనన్నకు ఝలక్.. ఎరుపెక్కిన విజయవాడ.. ఉద్యోగుల భారీ ప్రదర్శన..
Published on: Thu Feb 3, 2022 10:36AM
తగ్గేదేలే. పోలీసులు అడ్డుకున్నా ఆగేదేలే. ఖాకీలు రాత్రంతా కాపు కాశారు. వేల సంఖ్యలో మోహరించారు. వందలాది చెక్‌పోస్టులు పెట్టారు. అడుగడుగునా సీసీకెమెరాలు ఏర్పాటు చేశారు. నోటీసులు ఇచ్చారు. వార్నింగులు ఇచ్చారు. హౌజ్ అరెస్టులతో అడ్డుకోవాలని చూశారు. ఒకరా.. ఇద్దరా.. ఎంతమందినని అడ్డుకోగలరు? ఎవరినని ఆపగలరు? అందుకే, చలి చీమల్లా దండుకట్టారు. పీఆర్సీని కాటేసే పాముకు సవాల్ విసిరారు.
చలో విజయవాడతో బెజవాడ ఎరుపు రంగు పులుముకుంది. విజయవాడలో ఉద్యోగుల భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా పీఆర్సీ సాధన సమితి పిలుపు మేరకు చేపట్టిన ‘చలో విజయవాడ’కు భారీ సంఖ్యలో ఉద్యోగులు తరలివచ్చారు. జిల్లాల్లో పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నాలు చేసినా వాళ్లను ఛేదించుకుని మరీ విజయవాడ చేరుకున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు విజయవాడలో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఎన్జీవో భవన్ నుంచి అలంకార్ థియేటర్ కూడలి మీదుగా బీఆర్‌టీఎస్ రోడ్డు వైపు ర్యాలీగా ముందుకు సాగారు. ఆ దారంతా ఎర్ర జెండాలతో ఎరుపెక్కింది. పీఆర్సీ నినాదాలతో మారుమోగింది.
పీఆర్సీ జీవోలను రద్దు చేసే వరకు ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదని ఉద్యోగ సంఘాల నేతలు తేల్చి చెప్పారు. తమను అణచివేసే ప్రయత్నాలు చేస్తే ఉద్యమం మరింత ఉవ్వెత్తున ఎగిసిపడుతుందని హెచ్చరించారు. హక్కుల సాధన కోసం ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పారు. ‘వుయ్ వాంట్ జస్టిస్’.. ‘అర్ధరాత్రి ఇచ్చిన చీకటి జీవోలు రద్దు చేయాలి’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.


