TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చ‌ల్ చ‌లోరే చ‌లో.. చ‌లో విజ‌య‌వాడ‌తో స‌ర్కారులో వ‌ణుకు..

Published on: Thu Feb 3, 2022 9:59AM

అంత భ‌య‌మెందుకు? ఉద్యోగులంటే బెదురెందుకు? త‌ప్పేమీ చేయ‌క‌పోతే.. అంతా క‌రెక్టే అనుకుంటే.. చ‌లో విజ‌య‌వాడ‌ను అడ్డుకోవ‌డం ఎందుకు?  ఖాకీ బ‌ల‌గాల‌తో, ఇనుప‌ ముళ్ల కంచెల‌తో, క‌ఠిన ఆంక్ష‌ల‌తో, హౌజ్ అరెస్టుల‌తో.. మ‌హోద్య‌మాన్ని ఆప‌గ‌ల‌రా? ఆప‌త‌ర‌మా? 

పీఆర్సీపై జ‌గ‌న్ స‌ర్కారు దిగొచ్చే వ‌ర‌కూ త‌గ్గేదేలే అంటున్నారు ఉద్యోగులు. చ‌లో విజ‌య‌వాడ ఉద్రిక్త‌త‌ల మ‌ధ్య కొన‌సాగుతోంది. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చే ఉద్యోగులను ఎక్కడికక్కడ అడుకునేందుకు ప్రత్యేక పోలీస్ బలగాలను ఏర్పాటు చేశారు. విజయవాడకు వస్తున్న ప్రతి బస్సుని, కార్లు, బైక్‌లను ఆపి చెక్ చేస్తున్నారు. ఉద్యోగుల వాట్సాప్ చెక్ చేసి మరీ అరెస్ట్ చేస్తున్నారు. ఆరెస్ట్ చేసిన వారిని కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారు.

పలుచోట్ల ఉద్యోగ సంఘాల నేతలను గృహనిర్బంధం చేస్తున్నారు. ‘చలో విజయవాడ’కు అనుమతి లేదంటూ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ఉద్యోగులు వచ్చే వాహనాలను వెనక్కి పంపుతున్నారు. నిరసనలో పాల్గొనేందుకు అనంతపురం, కర్నూలు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కడప, ప్రకాశం జిల్లాల నుంచి బస్సులు, ప్రైవేటు వాహనాల్లో బయలు దేరిన ఉద్యోగులను అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారంతా పోలీసుల వైఖరి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.

  

విజయవాడ రైల్వేస్టేషన్‌కు చేరుకున్న పలువురు ఉద్యోగులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అరెస్ట్‌లపై ఉద్యోగ సంఘాల నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నుంచి వాహనాల్లో వచ్చిన ఉద్యోగులను ఏలూరు ద‌గ్గ‌ర‌ పోలీసులు అడ్డుకున్నారు. కడప జిల్లా నుంచి విజయవాడ వెళ్తున్న ఉద్యోగులను నెల్లూరు జిల్లా కావలి ద‌గ్గ‌ర‌ పోలీసులు అడ్డుకున్నారు. 

పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటుండటంతో కొందరు ఉద్యోగులు మారు వేషాల్లో విజయవాడ వెళ్లేందుకు ప్ర‌యత్నించారు. నెల్లూరు రైల్వేస్టేషన్‌లో ఆత్మకూరు మండలానికి చెందిన ఓ ఉద్యోగి అంగవైక‌ల్యం ఉన్న వ్యక్తిగా మారు వేషంలో వెళ్తుండగా అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరికొందరు ఉద్యోగులు కూలీల మాదిరిగా రైల్వే స్టేషన్లకు చేరుకున్నారు. వారిలో కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకోగా.. మరికొందరు వారి కళ్లు గప్పి విజయవాడ చేరుకున్నారు. పోలీసులు ఉద్యోగుల‌ను అడ్డుకుంటున్నా.. ఏదో ఒక ర‌కంగా విజ‌య‌వాడ‌కు పెద్ద సంఖ్య‌లోనే చేరుకుంటున్నారు. పీఆర్సీపై త‌మ వాయిస్ బ‌లంగా వినిపిస్తున్నారు.