మళ్ళీ మొదలవనున్న తెలంగాణా ఉద్యమాలు

 

నిరంతరం ఉద్యమాలు, నిరాహార దీక్షలు చేయాలన్నా ఎవరికయినా కష్టమే. అందుకే అపుడప్పుడు పండుగ శలవులు, పరీక్షల శలవులు, వేసవి శలవులు వంటివి అప్రకటితంగా అమలు చేస్తుంటారు మన ఉద్యమ నేతలు. ఇక, కేసీఆర్ కూడా ఉద్యమాలకి గుడ్ బై చెప్పేసి ఓట్లు-సీట్లు జపం అందుకోవడంతో ఆచార్యుల వారు ముఖ్యమంత్రి పుణ్యామాని బయ్యారం గనుల వ్యవహారం అందిపుచ్చుకొని కాలక్షేపం చేస్తున్నారు.

 

నిన్న టీఎన్‌జీవో భవన్‌లో జరిగిన టీ-జేఏసీ స్టీరింగ్‌ కమిటీ సమావేశానికి హాజరయిన కేసీఆర్‌, జి. కిషన్‌రెడ్డి తదితరులు వచ్చే నెల 14న ఛలో అసెంబ్లీ కార్యక్రమంతో మళ్ళీ ఉద్యమం రీ-స్టార్ట్ చేయాలని నిశ్చయించుకొన్నారు. అనంతరం ఛైర్మన్‌ కోదండరామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ అంశంపై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేందుకే తాము ఛలో అసెంబ్లీకి పిలుపునిస్తున్నామని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ఎక్కడా హింసకు తావివ్వకుండా శాంతియుతంగా, చట్టబద్దంగా నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమానికి అన్నిరాజకీయ పార్టీలు సహకరించాలని ఆయన కోరారు.

 

షరా మామూలుగానే చలో అసెంబ్లీ కార్యక్రమానికి ముఖ్య మంత్రి అనుమతి నిరాకరించడం, దానిని తెరాస, టీ-జేయేసీ నేతలు తప్పు పడుతూ మీడియా ముందుకొచ్చి మాట్లాడటం, కాంగ్రెస్ పార్టీలో తెలంగాణా మంత్రులు, శాసనసభ్యులు దద్దమ్మలని కేసీఆర్ తిట్ల దండకం అందుకోవడం, దానికి వెంటనే ముఖ్యమంత్రి అనుచరుడు జగ్గారెడ్డి దీటుగా జవాబు చెప్పడం వంటి కార్యక్రమాలు కూడా త్వరలో జరుగనున్నాయి. తెలంగాణా నుండి ఆంధ్రా పార్టీలను తరిమి కొట్టాలని ఒకవైపు కేసీఆర్ తన కార్యకర్తలకు ఉద్బోదిస్తుంటే, ప్రొఫ్. కోదండరాం అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరడం విశేషం.