హక్కుల బావుటా చాకలి ఐలమ్మ

'ఈ భూమి నాది.. పండిన పంట నాది. తీసుకెళ్లడానికి ఆ దొర ఎవడు' అంటూ బడుగుజీవుల రక్తాన్ని పీల్చే దొరలకు ఎదురొడ్డి నిలబడిన ధీశాలి చాకలి ఐలమ్మ. దొరల గుండెల్లో మంటలు రేపిన అగ్నికణం ఆమె. తన హక్కుల కోసం ఆమె జరిపిన పోరాటం, ప్రతిఘటన మహిళాలోకానికి, యువతరానికి ఆదర్శం. భూమి కోసం.. భుక్తి కోసం ప్రజలను కూడగట్టిన ఆమె పోరాటపటిమ స్ఫూర్తిదాయకం. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి దారి చూపిన వీరవనిత. ఆమె పేరులేనిదే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం లేదంటే అతిశయోక్తి కాదు. ప్రశ్నిస్తే ప్రాణాలు పోతాయన్నంత భయంతో బతుకుతున్న నేటితరానికి ఆమె మార్గదర్శి.

 

చాకలి ఐలమ్మ 1895 లో వరంగల్‌ రూరల్‌ జిల్లా రాయపర్తి మండలం కిష్టాపురం లో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు ఓరుగంటి మల్లమ్మ, సాయిలు. ఆమెకు పదకొండేండ్లకే పాలకుర్తికి చెందిన చిట్యాల నర్సయ్యతో పెళ్ళి అయ్యింది. వారికి ఐదుగురు కొడుకులు, ఒక కూతురు. ఐలమ్మ కుటుంబం ఆంధ్రమహాసభలో సభ్యత్వం తీసుకోవడంతో పాటు తమ ఇంటిలోనే సంఘం కార్యాలయాలన్ని ఏర్పాటుచేశారు. ఆమె ఇంటిని కేంద్రంగా చేసుకుని పాలకూర్తిలో ఆంధ్రమహాసభ కార్యక్రమాలు జరిగేవి. 

 

పాలకుర్తికి పక్కనే నాలుగు ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని కుంటుంబమంతా కష్టపడేవారు. సంఘం కార్యక్రమాల్లో చురుగ్గా ఉన్న ఆ కుటుంబాన్ని దెబ్బతీయాలన్న ఆలోచనతో ఆ ఊరి దొర రామచంద్రారెడ్డి అనేక విధాలుగా వేధించాడు. కౌలు భూమిలో పండిన పంట తీసుకుపోవడానికి తన అనుచరులను పంపించాడు. ఆంధ్ర మహాసభ కార్యకర్తలు ఐలమ్మ కుటుంబానికి అండగా నిలిచారు. కొంగు నడుముకు చుట్టి రోకలిబండ చేతపట్టుకుని దొర అనుచరులను ఆమె తరిమికొట్టారు. ఐలమ్మ సాహసంతో సాయుధపోరు ప్రారంభమైంది. రాజీ పేరుతో ఐలమ్మను గడీకి పిలిపించి ‘నిన్ను ఇక్కడ చంపితే దిక్కెవరు’ అని భయపెట్టే ప్రయత్నం చేసిన దొరకు దిమ్మతిరిగే సమాధానం చెప్పింది. ‘నన్ను చంపితే నా కొడుకులు నిన్ను బతకనీయరు. నీ గడీల గడ్డి మొలస్తది’ అని అదురుబెదురు లేకుండా చెప్పింది. ఆమె ధైర్యం చూసి దొరే ఖంగు తిన్నాడు. నిజాం పాలనకు, దొరల ఆగడాలకు వ్యతిరేకంగా ఆమె చేసిన పోరాటం సాయుధ రైతాంగ పోరాటానికి ఊపిరి అయ్యింది. ఆమె స్ఫూరి కారణంగా ఊపు అందుకున్న ఉద్యమం ఫలితంగా దాదాపు పది లక్షల ఎకరాల భూమి పంపకం జరిగింది. గడీల గడ్డి మెులవాలన్న ఆమె మాటలకు దేవతలు కూడా తథాస్తు అన్నట్లు దొరల రాజ్యం పోయింది, గడీల గడ్డి మొలిచింది. అగ్నికణంగా దొరల గుండెల్లో మంటలు పుట్టించిన ఐలమ్మ 1985 సెప్టెంబర్‌ 10న మరణించింది. పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్ళు తప్ప అన్న శ్రీశ్రీ మాటలకు ఆమె జీవితమే నిదర్శనం.