కాంగ్రెస్ నేతల చేతిలో చైతన్యరాజు బకరా అయ్యారా?

 

రాజ్యసభ ఎన్నికల పర్వం మొదలవగానే సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు తమను ఇంతగా అవమానిస్తున్న అధిష్టానానికి బుద్ధి చెప్పేందుకు తగిన అవకాశం వచ్చిందని చాల మందే పోటీకి సిద్దమయ్యారు. కానీ, నామినేషన్ల సమయం వచ్చేసరికి, తాము ఎవరికయితే గట్టిగా బుద్ధి చెప్పాలని భావించారో, ఆ అధిష్టానం ఆదేశాలకే తలొగ్గి అందరూ పోటీలో తప్పుకొన్నారు. కానీ, వారి భరోసాతో ప్రముఖ విద్యావేత్త, యం.యల్సీ. చైతన్యరాజు, ఆదాల ప్రభాకర్ రెడ్డి బరిలో దిగారు. వారు నామినేషన్లు వేసినప్పటి నుండి పీసీసీ అధ్యక్షుడు వారిరువురిని, ముఖ్యంగా చైతన్య రాజుని ఎలాగయినా పోటీ నుండి తప్పించాలని చాలా ప్రయత్నాలు చేసారు. చైతన్యవిద్యాసంస్థలకి అధిపతిగా సమాజంలో ఎంతో గౌరవనీయమయిన స్థానంలో ఉన్న చైతన్యరాజుపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారంట్లు ఉన్నాయని రిటర్నింగ్ ఆఫీసరుకు లేఖలు వ్రాసారు. కానీ, ఎన్నికల అధికారులు అవి తప్పుడు ఆరోపణలని నిర్దారించుకొని ఆయన నామినేషన్ దృవీకరించారు.

 

అప్పటి నుండి ముఖ్యమంత్రి మొదలు అంతవరకు ఆయనకు మద్దతు ఇచ్చిన మంత్రులు, శాసనసభ్యులు అందరూ కూడా ఆయనపై తీవ్ర ఒత్తిడి తీసుకు వచ్చి, చివరికి ఈరోజు ఆయన చేత తన నామినేషన్ ఉపసంహరింపజేసి గానీ ఆయనను వదిలిపెట్టలేదు. విద్యాధికుడు, విద్యావేత్త అయిన చైతన్య రాజు పెద్దల సభకు వెళ్లేందుకు అన్నివిధాల అర్హుడు. ఆయనని పోటీ చేయమని, తాము మద్దతు ఇస్తామని ఉసిగొల్పి తీరాచేసి నామినేషన్ వేసిన తరువాత ఆయనను కాంగ్రెస్ నేతలందరూ కలిసి ఘోరంగా అవమానించడమే కాకుండా, చివరికి ఆయనకు మద్దతు ఇచ్చిన వారే ఆయన చేత బలవంతంగా నామినేషన్ ఉపసంహరింపజేసి మరింత అవమానపరిచారు.

 

సమాజంలో అందరివద్ద గౌరవం అందుకొనే ఆయన ఈ కాంగ్రెస్ నేతల చేతిలో అవమానం పాలవడం చాలా దురదృష్టకరం. కాంగ్రెస్ నేతలు తమ శాసనసభ్యులకు నచ్చజెప్పుకొని, తమ పార్టీ నిలబెట్టిన అభ్యర్ధులనే గెలిపించుకొని ఉంటే, అప్పుడు ఆయన పోటీలో ఓడిపోయినా ఇంత అవమానంగా ఉండేది కాదు. కానీ ఆయనను ఎన్నికలలో పోటీ చేయమని ప్రోత్సహించి, ఆయనను అప్రదిష్టపాలు చేసిన తరువాత ఆయనను బలవంతంగా పోటీ నుండి విరమింపజేయడం చాలా హేయమయిన చర్య. కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎన్నికలు చాల ప్రతిష్టాత్మకంగా భావించి ఉండవచ్చును. కానీ అదేసమయంలో చైతన్యరాజుకి కూడాసమాజంలో ఒక విలువ గౌరవం ఉంటాయనే సంగతి కాంగ్రెస్ పట్టించుకోకపోవడం చాలా విడ్డూరం. ఒకవిద్యావేతను పెద్దల సభకు పంపడం కంటే ముగ్గురు రాజకీయ నాయకులను పంపడమే తనకు మేలని కాంగ్రెస్ భావించడం ఆ పార్టీ దౌర్భాగ్యం.