జగన్ వల్ల నవ్వులపాలైన లోకేష్

 

ఓ సినిమాలో రెండు వేరు వేరు రాజకీయ పార్టీలకు ఒక్కడే రైటర్ గా స్పీచ్ రాస్తాడు. రాజకీయనాకుల సహజమైన నైజం ప్రత్యర్థుల్ని తిట్టటం. రైటర్ కూడా అలానే ఎవరి వెర్షన్ కి తగ్గట్టు వాళ్ల ప్రత్యర్థిని తిడుతూ స్పీచ్ రాశాడు. కాకపోతే ఇక్కడే ఓ చిక్కొచ్చింది. ఒకరికి ఇవ్వాల్సిన స్క్రిప్ట్ మరొకరికి ఇచ్చాడు. దీంతో వాళ్ళని వాళ్లే తిట్టుకున్నారు. సభ అంతా నవ్వులపాలైంది. ఇలాంటివి సినిమాల్లోనే జరుగుతాయి అనుకుంటే పొరపాటే. నిజ జీవితంలోనూ జరుగుతాయి. అచ్చుగుద్దినట్టు కాకపోయినా ఇదే తరహాలో ఓ ఘటన ఏపీలో జరిగింది. అది కూడా నారా లోకేష్ సభలోనే జరగటం కొస మెరుపు. ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మ‌కంగా రాష్ట్ర వ్యాప్తంగా 4 ల‌క్ష‌ల గృహ‌ప్ర‌వేశాల‌ను నిర్వ‌హించింది. తిరుతిలో జ‌రిగిన స‌భ‌లో లోకేష్ పాల్గొన్నారు. ఆ స‌భ కోసం నిర్వాహకులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. నిర్వాహకులు ఉపయోగించిన కుర్చీలు లోకేష్ సభని నవ్వుల పాలు చేశాయి.

ఆ కుర్చీలపై 'జగన్ కావాలి.. జగన్ రావాలి' అనే స్లోగన్స్ ఉన్న స్టిక్కర్లు ఉండటమే ఇందుకు కారణం. ఈ విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు అక్కడికి చేరుకొని ఈ దృశ్యాలని చిత్రీకరించే పనిలోపడ్డారు. దీంతో షాక్ తిన్న టీడీపీ నేతలు తేరుకొని దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టారు. ఆ కుర్చీలను సభా ప్రాంగణం నుంచి తొలగించారు. ఈ సందర్భంగా సభకు ఏర్పాట్లు చేసిన నిర్వాహకులపై టీడీపీ నేతలు మండిపడ్డారు. ఇంతకీ అసలు కారణం ఏంటా అని నేతలు ఆరా తీశారు. రెండ్రోజుల క్రితం తిరుపతిలో జగన్ సభ జరిగిన సంగతి తెలిసిందే. ఈ రెండు కార్యక్రమాలకి నిర్వాహకులు ఒక్కరే కావటంతో అక్కడ వాడిన కుర్చీలే ఇక్కడ కూడా వాడటంతో ఈ పొరపాటు జరిగినట్టు తెలుస్తుంది. టీడీపీ నేత‌లు ఎంత కవర్ చేయబోయినా ఈ వ్య‌వ‌హారం పెద్ద ఎత్తున మీడియాలో ప్ర‌సారం అయింది. దీనిని చూసి వైసీపీ నేత‌లు న‌వ్వుకుంటుం డ‌గా..టీడీపీ నేత‌లు మాత్రం త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. మొత్తానికి టీడీపీ సభ కాస్తా నిర్వాహకులు,పార్టీ నేతల నిర్లక్ష్యం వల్ల వైసీపీ ప్రచార సభగా మారింది.