TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జాతీయ గీతాలాపనపై కేంద్రం సర్క్యులర్ సూచన మాత్రమే.. సుప్రీం కీలక వ్యాఖ్యలు

Published on: Wed Mar 25, 2026 5:59PM

ప్రభుత్వ, అధికారిక కార్యక్రమాల్లో జాతీయ గేయం   పాడాలంటూ కేంద్రం జారీ చేసిన సర్క్యులర్‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆ సర్క్యులర్ కేవలం  సూచన మాత్రమేననీ,   గీతాలాపన తప్పని సరి అని కాదనీ సుప్రీం స్పష్టం చేసింది. ఆ సర్క్యులర్ లో గీతాలాపన చేయకపోతే ఎలాంటి శిక్షా లేదనీ, అందుకే ఈ పిటిషన్ ను విచారించాల్సిన అవసరం లేదనీ స్పష్టంగా పేర్కొంది.

సుప్రీం కోర్టు  ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్యా బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం. పంచోలిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్ ను విచారించింది.  జనవరి 28న కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్ కేవలం సలహా మాత్రమేనని, దాన్ని పాటించకపోతే శిక్షలు ఉంటాయని ఎక్కడా  పేర్కొన లేదనీ సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది.   గీతాలాపన చేయకపోతే  శిక్షార్హమైన చర్యలు తీసుకుంటే, అలాగే అధికారిక కార్యక్రమాలలో వందేమాతరం గీతాలాపన తప్పని సరి చేస్తే అప్పుడు విచారిస్తామని పేర్కొంది.  

కాగా పిటిషనర్ తరఫున వాదించిన  సీనియర్ న్యాయవాది సంజయ్ హెగ్డే..  సర్క్యులర్‌లో శిక్షలు లేకపోయినా ఇది పరోక్ష ఒత్తిడికి దారితీస్తుందన్నారు.  వందేమాతరం పాడటానికి లేదా గౌరవ సూచకంగా నిలబడటానికి నిరాకరించే వారు సామాజిక వివక్షను ఎదుర్కొనే ప్రమాదం ఉందన్నారు.  అయితే ఆ ఆభ్యంతరాలు, ఆందోళన ఊహాజనితమేనని సుప్రీం అభిప్రాయపడింది.  ఈ విషయంలో  ఎవరిపైనైనా చర్యలు తీసుకున్నా,  వివక్ష చూపినా, అప్పుడు మళ్లీ కోర్టును ఆశ్రయించవచ్చని సూచిస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది.