హోదా లేదు.. నిధులివ్వరు! ఏపీపై ఎందుకింత కక్ష?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంటే ఆ పార్టీలకు పడనట్లుంది. అందుకే కక్షగట్టినట్లుగా వ్యవహరిస్తున్నాయి. రాజకీయ ప్రయోజనాల కోసం ఆంధ్ర ప్రజలను మోసం చేస్తున్నాయి. రాష్ట్ర భవిష్యత్తునే అంధకారంలోకి నెడుతున్నాయి. ఇది ప్రస్తుతం సగటు ఆంధ్రప్రదేశ్ వాసి మదిలో తొలస్తున్న ప్రశ్న. కేంద్రంలో అధికారం అనుభవించిన కాంగ్రెస్, బీజేపీలు ఏపీతో ఆటలాడుకుంటున్నాయనే ఆగ్రహం ఏపీ జనాల్లో వ్యక్తమవుతోంది. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ నట్టేట ముంచితే... గత అరేండ్లుగా బీజేపీ తమను దగా చేస్తుందనే ఆరోపణలు ప్రజల నుంచి వస్తున్నాయి. రాష్ట్ర విభజన నుంచి తాజాగా పోలవరం ప్రాజెక్ట్ అంచనా వ్యయం తగ్గింపు వరకు ఈ రెండు పార్టీలు ఆంధ్రప్రదేశ్ కు మోసం చేస్తూనే ఉన్నాయని జనాలు ఫైరవుతున్నారు. 
      

ప్రత్యేక హోదా విషయంలో ఈ రెండు పార్టీలు పాపం మూటగట్టుకున్నాయి. విభజన సమయంలో  ఏపీకి ప్రత్యేక హోదా హామీ ఇచ్చిన అప్పటి  కాంగ్రెస్ ప్రభుత్వం.. విభజన చట్టంలో మాత్రం పెట్టలేదు.ఇక హోదా సంగతి ఎవరికి పెద్దగా తెలియనప్పుడే.. ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా ఇవ్వమని చెప్పింది బీజేపీ. అధికారంలోకి వచ్చాకా ప్లేటు ఫిరాయించింది . విభజన చట్టంలో పెట్టలేదంటూ కాంగ్రెస్ పై నెపం వేస్తూ.. హోదా ఇవ్వడం కుదరదని చెప్పింది. హోదాకు బదులు ప్యాకేజీ ఇస్తామని ప్రకటించి దాన్ని కూడా పక్కనపట్టేసింది పువ్వు పార్టీ. నీతి ఆయోగ్ పేరుతో రూల్స్ మార్చి.. ప్యాకేజీ కాదు  స్పెషల్ పర్పస్ వెహికల్ కింద  అప్పులాగా  తీసుకోవాలని మాట మార్చింది.ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భారం మోపుతోంది.  

 

2014 ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్ కు ఢిల్లీని తలదన్నే రాజధానిని ఇస్తామని హామీ ఇచ్చారు బీజేపీ పెద్దలు. అమరావతి  శంకుస్థాపనకు వచ్చిన కేంద్ర పాలకులు అదే మాట చెప్పారు. తర్వాత కేపిటల్ ఊసే మర్చిపోయారు. ఇప్పుడు అమరావతిని మూడు ముక్కలు చేసే ప్రయత్నాలు జరుగుతున్నా కాషాయ పార్టీ నేతలు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఏపీ రాజధాని  విషయంలో బీజేపీ తీరు మరీ దారుణంగా ఉంటోంది. ఏపీ బీజేపీ నేతలు అమరావతికి మద్దతుగా మాట్లాడుతుండగా.. కేంద్రం మాత్రం తమ పరిధిలోనిది కాదని, రాష్ట్ర ప్రభుత్వం ఇష్టమని కోర్టులో ఏకంగా అఫిడవిట్ దాఖలు చేసింది. దీంతో అసలు రాజధాని విషయంలో బీజేపీ స్టాండో ఏంటో చెప్పాలనే డిమాండ్లు వస్తున్నాయి. ద్వంద్వ విధానాలతో ఏపీ జనాలను మోసం చేయవద్దని కొందరు హెచ్చరిస్తున్నారు. ఇక  అమరావతి శంకుస్థాపన సందర్భంగా ఏపీకి అండగా ఉంటామని హామీ ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ.. ఇప్పుడు కనీసం స్పందించకపోవడాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. 

 

జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరం నిర్మాణం పూర్తికి  అన్ని విధాలా సహకరిస్తామన్న మోడీ సర్కార్.. ఇప్పుడు దాని నిధుల్లో కోతలు పెట్టడం కలకలం రేపుతోంది. ఏపీకి జీవనాడిని చెప్పుకునే పోలవరం ప్రాజెక్టును కేంద్రం నిర్లక్ష్యం చేయడంపై ఏపీ ప్రజలు ఫైరవుతున్నారు. విభజనతో నష్టపోయిన రాష్ట్రానికి .. కేంద్ర సంస్థల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చేసి.. చాలా ఇచ్చేశామని చెప్పుకున్నారే గాని.. ఇవ్వాల్సినవి ఇవ్వలేదనే చర్చ జరుగుతోంది.  కేంద్ర మంత్రిగా వెంకయ్య నాయుడు ఉన్నప్పుడు కొద్దొ గొప్పో నిధులు వచ్చాయని .. ఆయన కేంద్ర కేబినెట్ నుంచి వెళ్లాక ఏపీ పూర్తిగా నిర్లక్ష్యానికి గురయిందని ఏపీ ప్రజలు చెబుతున్నారు. జాతీయ రహదారులు, రైళ్లకు జనరల్ గా ఏటా అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్లే ఏపీకి ఇచ్చిన డబ్బులను  లెక్కేసి..  ఇంతిచ్చాం అంతిచ్చామని ప్రచారం చేసుకుంటున్నారు కాని ఏపీకి ప్రత్యేకంగా   మోడీ  సర్కార్ ఏమిచ్చిందో చెప్పాలనే డిమాండ్లు జనాల నుంచి వస్తున్నాయి. 

 

అంతర్వేది, దుర్గగుడి లాంటి మతపరమైన అంశాలొచ్చినప్పుడు రాజకీయంగా లాభపడటానికి చూసుకున్నారని... తెర వెనక మంతనాలతో వాటిని ముగించేశారనే ఆరోపణలు వస్తున్నాయి. ఒక్కో రోజు ఒక్కో స్ట్రాటజీ తీసుకుంటూ బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో ఆటలాడుతుందనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. రాజకీయంగా తెలుగుదేశాన్ని దెబ్బకొట్టాలనుకున్నప్పుడు వైసీపీకి కోఆపరేట్ చేయడం.. వైసీపీకి కూడా చెక్ పెట్టాలనుకుంటే మరోలా చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది.దీంతో బీజేపీ తీరుపై ఏపీ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ఆంధ్రప్రదేశ్ కు ఎందుకిలా అన్యాయం చేస్తున్నారోనని సామాన్యులు ఆవేదన చెందుతున్నారు. ఏపీ అంటే ఎందుకంత కసే తమకు అర్ధం కావడం లేదని ప్రజలు ఆందోళన పడుతున్నారు.