పోలవరం పై జగన్ సర్కార్ కు కేంద్రం డెడ్ లైన్ !!

 

ఎపి సీఎం జగన్ పోలవరం విషయం లో అనేక సంచలన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. పోలవరం ప్రాజెక్ట్ లో అవినీతి సంగతి తేల్చడానికి ఏర్పాటు చేసిన రేమండ్ పీటర్ కమిటీ తన రిపోర్ట్ ను ప్రభుత్వానికి సమర్పించిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం రివర్స్ టెండర్ కు వెళ్ళింది. ఐతే కేంద్రం ఇదే విషయమై పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సిఇఓ ఆర్ కె జైన్ నుండి రిపోర్ట్ కోరడం తో ఆయన వెంటనే ప్రాజెక్ట్ ను సందర్శించి రెండు రోజులలోనే తన రిపోర్ట్ కేంద్రానికి అందించటం జరిగింది. ఐతే పిఎంఓ ఆదేశాల మేరకు కేంద్ర జలశక్తి శాఖ రాష్ట్ర ప్రభుత్వం నుండి రేమండ్ పీటర్ కమిటీ రిపోర్ట్ లోని అంశాల పైన రాష్ట్ర ప్రభుత్వం యొక్క అభిప్రాయాన్ని కోరడం జరిగింది. గతేడాది కేంద్ర జల సంఘం నిపుణుల కమిటీ నివేదికకు రాష్ర ప్రభుత్వం నియమించిన రేమండ్ పీటర్ కమిటీ నివేదికకు పొంతన లేక పోవడం తో ఈ రెండు రిపోర్టుల పైన రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయాలు తెలపాలని కోరింది. ఐతే రెండు వారాలైనా జగన్ ప్రభుత్వం నుండి జవాబు లేక పోవడం తో మరో మరో సారి లేఖ రాస్తూ రెండు రోజులలో నివేదిక పంపాలని సూచించినట్లు తెలుస్తోంది. మరి దీనికయినా జగన్ ప్రభుత్వం స్పందిస్తుందో లేక కేంద్రం తో చివాట్లు తింటుందో వేచి చూడాలి.