హైదరాబాద్ నగరానికి అవార్డు

 

గ్రేటర్ హైదరాబాద్‌కు మరో అవార్డు వరించింది. హైదరాబాద్ నగరానికి ‘స్వచ్ఛత ఎక్సలెన్సీ’ అవార్డును కేంద్ర స్వచ్ఛ భారత్ మిషన్ ప్రకటించింది. 10 లక్షల జనాభా కలిగిన మెట్రోపాలిటన్ నగరాలలో కేవలం హైదరాబాద్‌కు మాత్రమే ఈ పురస్కారం లభించింది. జీహెచ్‌ంఎసీ, జలమండలిలోని వివిధ విభాగాల్లో కార్మికులకు స్వయం ఉపాధి కల్పించి, వారిని చిన్నస్థాయి పారిశ్రామిక వేత్తలుగా, యజమానులుగా మార్చినందుకు, మ్యాన్‌హోళ్లలోని మురుగును శుభ్రం చేయడానికి యంత్రాలను వినియోగిస్తున్నందుకు... జలమండలికి, జీహెచ్‌ఎంసీకి కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ అవార్డును ప్రకటించింది.

ఈ రెండు సంస్థలకు సంయుక్తంగా పురస్కారాన్ని అందిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.  భాగ్యనగరానికి స్వచ్ఛత ఎక్సలెన్సీ అవార్డు దక్కడం పట్ల జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దాన కిషోర్‌, నగర మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రోత్సాహంతో నగరాన్ని మరింత శుభ్రంగా మారుస్తామని మేయర్‌ పేర్కొన్నారు. 10 రోజుల వ్యవధిలోనే నగరానికి రెండు అవార్డులు రావడం పట్ల జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దాన కిషోర్‌ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇదే స్ఫూర్తితో స్వచ్ఛ సర్వేక్షన్ 2019లోనూ మంచి ర్యాంకింగ్ సాధిస్తామని స్పష్టం చేశారు. ఇటీవలే నగరానికి ఓడిఎఫ్‌ ప్లస్‌ను స్వచ్ఛ భారత్ మిషన్ ప్రకటించిన విషయం తెలిసిందే.