మీ ఇష్టానుసారం చేయడం కుదరదు.. మా ఆశీస్సులు ఉండవు: కేంద్రం

 

పోలవరం ప్రాజెక్ట్ రీటెండరింగ్‌ అంశంపై కేంద్రం సీరియస్ గానే ఉన్నట్లు తెలుస్తోంది. శుక్రవారం నాడు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం రీటెండరింగ్‌ అంశంపైన, వైసీపీ ప్రభుత్వ నిర్ణయాల వెనుక ప్రధాని, హోంమంత్రి ఆశీస్సులు ఉన్నాయని.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపైన స్పందించారు.

పోలవరం ప్రాజెక్టుకు డబ్బులిచ్చేది కేంద్రమే కాబట్టి ఆ ప్రాజెక్టు విషయంలో ఏం జరుగుతుందో తెలుసుకొనే పూర్తిస్థాయి అధికారం తమకు ఉంటుందని మంత్రి షెకావత్‌ పేర్కొన్నారు. ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను రాష్ట్రప్రభుత్వం చేపట్టినంత మాత్రాన మాకు చెప్పకుండా ఇష్టానుసారం చేయడం కుదరదు. అక్కడ జరిగే ప్రతి విషయం మాకు తెలియాలి అన్నారు. ప్రస్తుతం పోలవరంలో జరుగుతున్న పరిణామాలపై పూర్తిస్థాయి వాస్తవ నివేదికను కోరామని, అది వచ్చిన తర్వాత పరిశీలించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ విషయం కోర్టులో ఉన్నందున ఇంతకుమించి నేనేమీ మాట్లాడను అని మంత్రి వ్యాఖ్యానించారు.

అదేవిధంగా విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యల గురించి మీడియా ప్రస్తావించినప్పుడు మంత్రి షెకావత్‌ స్పందిస్తూ.. ‘‘మనం ఇప్పుడు సమాఖ్య వ్యవస్థలో ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశాలపై రాష్ట్రం నిర్ణయం తీసుకుంటుంది. కేంద్ర పరిధిలోని అంశాలపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది. తప్పితే ఎవరి ఆశీస్సులు ఎవరికీ ఉండవు’’ అని వ్యాఖ్యానించారు.