TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వ్యాక్సిన్ కోసమే వాయింపు.. మోదీ సిగ్గు సిగ్గు.. 

Published on: Tue Oct 12, 2021 4:02PM

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతూనే ఉన్నాయి. ఇప్పటికే లీటర్ పెట్రోల్ ధర సెంచరీ మార్క్ దాటేసి దూసుకుపోతుండగా.. లీటర్ డీజిల్ రేటు వందకు దగ్గరలో ఉంది. కరోనా కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న సామాన్యుడు పెరుగుతున్న ఇంధన ధరలతో మరింతగా అల్లాడిపోతున్నారు. పెట్రోల్, డీజిల్​లను జీఎస్టీ పరిధిలోకి తేవాలంటూ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అయినా కేంద్ర సర్కార్ మాత్రం పట్టించుకోవడం లేదు. చమురు ధరల పెరుగుదలపై ప్రజల ఆందోళనను పట్టించుకోకపోవడమే కాదు.. ఎగతాళి చేసేలా మాట్లాడుతున్నారు బీజేపీ నేతలు. గతంలో ఓ బీజేపీ ఎంపీ పెట్రోల్ ధరలపై ప్రశ్నిస్తే.. ఆప్ఘనీస్తాన్ వెళ్లండంటూ కామెంట్ చేశారు. మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి అయితే ఏకంగా తప్పందా నెహ్రుపై వేసేశారు. నెహ్రు చేసిన పనుల వల్లే ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయని వ్యాఖ్యానించారు.

తాజాగా కేంద్ర సహాయమంత్రి  చమురు ధరల పెరుగుదలకు వింత కారణం చెప్పారు.  ప్రభుత్వం ఉచితంగా అందిస్తోన్న కరోనా టీకాల కారణంగా చమురు ధరలు పెరుగుతున్నాయని తెలిపారు కేంద్ర పెట్రోలియం, సహజ వనరుల శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తేలి. కొవిడ్​ టీకాలకు మీరెవరూ డబ్బులివ్వట్లేదు కదా.. అందుకే పెట్రోల్​, డీజిల్​ ధరల నుంచి డబ్బులు రాబడుతున్నామని చెప్పారు. ఒక లీటరు పెట్రోల్ కంటే ఒక లీటరు హిమాలయ నీరు ఖరీదైనదని కూడా తేలి చెప్పారు. 

‘పెట్రోల్ అంత ఖరీదైనది కాదు. కేంద్రం, రాష్ట్రాలు దానిపై పన్నులు విధించాయి. మరోపక్క ప్రభుత్వం ప్రజలందరికి కరోనా టీకాలు ఉచితంగా అందిస్తోంది. మీరు చెల్లించకుండా టీకాలకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఈ పన్నుల నుంచే టీకా డబ్బులు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం 130 కోట్ల మందికి ఉచితంగా టీకా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఒక్కో టీకా డోసు ధర రూ.1,200. ఒక్కొక్కరికి రెండు డోసులు వేయాలి కదా’ అని తేలి అన్నారు. అసోం బీజేపీ అధ్యక్షుడు భాబేశ్ కలిత మరో ఐడియా చెప్పారు, ముగ్గురు వ్యక్తులు మోటార్‌సైకిల్‌లో ప్రయాణించాలని, అలాగే ప్రజలు నడక సాధన చేయాలని సూచించడం విమర్శలకు తావిచ్చింది.

చమురు ధరలపై పెరుగుదలపై కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలపై జనాల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. కొవిడ్ టీకా ఫ్రీగా ఇస్తే రేట్లు పెరుగుతాయా అని ప్రశ్నిస్తున్నారు. ఇండియాలోనే చాలా దేశాలు కొవిడ్ టీకాను ఫ్రీగానే ఇస్తున్నాయని చెప్పారు. ఆ దేశాల్లో పెరగని రేట్లు మన దగ్గరే ఎందుకు పెరుగుతున్నాయని ప్రశ్నించారు. అంతేకాదు ఇప్పటికే చాలా ఉచిత పథకాలు ఉన్నాయి. రేషన్ బియ్యాన్ని కూడా కేజీ రూపాయికి అందిస్తున్నారు. మరీ ఉచిత పథకాల కోసం వేటి ధరలు పెంచారని కేంద్రమంత్రిని నిలదీస్తున్నారు జనాలు. కొవిడ్ కేర్ కు వేలాది కోట్లాది రూపాయలు విరాళంగా వచ్చాయని.. ఆ డబ్బంతా ఎక్కడికి పోయిందని ప్రశ్నిస్తున్నారు. అయినా ధరల పెరుగుదలపై ప్రశ్నిస్తే చిల్లర వ్యాఖ్యలు చేయడం ఎందుకనే చర్చ వస్తోంది.