కేసుల మాఫీ కోసమే ఢిల్లీ టూర్లు? బయటపడిన జగన్  బండారం 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఢిల్లీ బాగోతం బట్టబయలైంది. రాష్ట్ర ప్రయోజనాల కోసమే కేంద్ర మంత్రులను, బీజేపీ పెద్దలను కలుస్తున్నామన్న మాటలు... పచ్చి అబద్దాలని తేలిపోయింది. పార్లమెంట్ సాక్షిగా సీఎం జగన్ అబద్ధాలు బయటపడ్డాయి. పోలవరం ప్రాజెక్టు అంచనాలపై కేంద్రమంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి మాట్లాడలేదని తేలిపోయింది. 

గత జనవరి 19న ఢిల్లీ వెళ్లిన సీఎం జగన్.. అమిత్ షాను కలిశారు. ఆ సమావేశం తర్వాత సీఎంవో ప్రకటన విడుదల చేసింది. పెరిగిన పోలవరం అంచనాలను ఆమోదించాలని అమిత్ షాను జగన్ కోరినట్లు అందులో వెల్లడించింది. అయితే అలాంటి మెమొరాండం హోంశాఖకు ఇవ్వలేదని పార్లమెంట్‌లో జలశక్తిశాఖ సహాయ మంత్రి రతన్ లాల్ తెలిపారు. పోలవరంకు సంబంధించి పెరిగిన అంచనాలను కేంద్రం ఆమోదించాలని  పార్లమెంట్‌లో  సోమవారం వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కోరారు. దీనికి సమాధానమిచ్చిన జలశక్తి సహాయం మంత్రి రతన్ లాల్.. అటువంటి ప్రతిపాదన ఏదీ లేదని, మెమొరాండం కూడా జగన్ ఇవ్వలేదని స్పష్టం చేశారు. దీంతో ఢిల్లీ పర్యటనపై జగన్ చెబుతున్నదంతా ఉట్టిదేనని బట్టబయలైంది. 

సీఎం జగన్ జనవరి 19న, ఫిబ్రవరి 19న అమిత్‌ షాను కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర సమస్యలపై చర్చించామని చెప్పారు. కాని పార్లమెంట్ లో మంత్రి రతన్ లాల్ సమాధానంతో అదంతా ఉత్తదేనని తేలిపోయింది. జగన్ ఢిల్లీ పర్యటనలపై మొదటి నుంచి విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. తన కేసుల మాఫీ గురించి మాట్లాడేందుకే జగన్ ఢిల్లీ పెద్దలతో చర్చలు జరుపుతున్నారని విమర్శిస్తున్నారు. వైసీపీ నేతలు మాత్రం ఆ ఆరోపణలకు కౌంటరిస్తూ వస్తున్నారు. సీఎం జగన్ ఢిల్లీకి వచ్చి పెద్దలను కలిసి లోపల ఏం మాట్లాడుతున్నారు.. బయటకొచ్చి ఏం చెబుతున్నారో అన్నది ఇప్పుడు పార్లమెంట్ సాక్షిగా మరోసారి బయటపడింది.