తమకి ‘న్యాయం’ జరగటం లేదంటోన్న న్యాయమూర్తులు ఎక్కువవుతున్నారా?

2014కు ముందు కూడా అనేక సార్లు ప్రభుత్వ మార్పు జరిగింది. కానీ, అప్పుడెప్పుడూ పెద్దగా సంచలనం కాలేదు. కానీ, గత పార్లమెంట్ ఎన్నికల్లో మోదీ విజయం చరిత్ర తిరగ రాసింది. ఇది కేవలం మాట వరసకు చెప్పుకుంటోన్నది కాదు. నిజంగానే కాంగ్రెస్ కోలుకోలేని దెబ్బతిన్నది. మళ్లీ హస్తం పైకె లేవదు అని మనం చెప్పలేకున్నా దాదాపుగా తుడిచి పెట్టేశారు మోదీ! రెండు వందల సీట్ల నుంచీ నలభైకి పడిపోయింది కాంగ్రెస్ గ్రాఫ్! మళ్లీ ఆ రెండు వందల మార్కు ఎంపీ సీట్లు దాటటానికి రాహుల్ గాంధీ కాంగ్రెస్‌కి ఎంత టైం పడుతుంది? ఏమో చెప్పటం కష్టమే!

 

 

ఇప్పుడు మోదీ కాంగ్రెస్ పై చేసిన దండయత్ర గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే… దిల్లీలో పీఠంపైకి కొత్త నేత రావటంతో దాని ప్రభావం అన్ని వ్యవస్థలపైనా పడుతోంది. రాహుల్, మమతా, మాయావతి, ములాయం, మన చంద్రబాబు… ఇలా చాలా మంది మోదీ వ్యతిరేక రాజకీయ పోరాటం చేస్తున్నారు. వీళ్లది కనిపించే యుద్ధం. కానీ మరో వర్గం వారు కనిపించని రణ రంగం చేస్తున్నారు మోదీ, ఆయన అనుకూల వర్గం శక్తులతో! అలాంటి వారే ఆర్బీఐ గవర్నర్ గా పని చేసిన రఘురామ్ రాజన్, సుప్రీమ్ కోర్టు జస్టిస్ జోసెఫ్ ఎక్సెట్రా ఎక్సెట్రా…

 

 

మోదీ ప్రభుత్వానికి రఘురామ్ రాజన్ కి వున్న భేధాభిప్రాయాలు మనకి తెలియనివి కావు. అసలు ఆయన వున్నంత కాలం నోట్ల రద్దు జరగకపోవటం మోదీ సర్కార్ తో ఆయనకున్న గ్యాప్ వల్లే! అంతే కాదు, రఘురామ్ రాజన్ కాస్త కాంగ్రెస్ అనుకూల వైఖరి ప్రదర్శించటమూ మనం ఊహించలేని పరిణామం ఏం కాదు. ఎందుకంటే, ఆయనని విదేశాల నుంచీ తీసుకు వచ్చి ఆర్బీఐ గవర్నర్ ను చేసింది సోనియా ప్రభుత్వమే. ఇటువంటి దూరం అనేది ప్రభుత్వాలు మారినప్పుడు చాలా చోట్ల కనిపిస్తుంటుంది. రాష్ట్రాల్లో అయితే పాత సీఎం పోయాక కొత్త సీఎంతో ఇమడలేని చాలా మంది ఉన్నతాధికారులు ప్రాముఖ్యత లేని పదవుల్లోకి ట్రాన్స్ ఫర్లు అయిపోతుంటారు….

 

 

2014లో వచ్చిన కొత్త ప్రధానికి , అంతకు ముందు కాంగ్రెస్ ప్రోత్సహించిన ఉన్నతాధికారులకి నడుమ మనస్పర్థలు పెద్ద పట్టించుకోవాల్సినవి కావు. కానీ, అత్యంత కీలకమైన న్యాయవ్యవస్థలో కూడా అనేక మంది జడ్జీల విషయంలో కేంద్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోంది. రాజ్యాంగం ప్రకారం స్వతంత్రంగా వుండాల్సిన న్యాయవ్యవస్థ, మరీ ముఖ్యంగా సుప్రీమ్ కోర్టులోని అంతర్గత ప్రపంచం ఇప్పుడు పదే పదే రోడ్డున పడుతోంది. ఆ మధ్య చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా విషయంలో నానా హంగామా జరిగింది. ఆయన మీద ఆరోపణలు చేసిన ప్రతిపక్షలు ఏకంగా అభిశంసనకు ప్రయత్నించాయి. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మోదీ ప్రభుత్వ సలహా మేరకు దాన్ని తోసి పుచ్చారు. ఇలా ప్రతిపక్షం ఒక ప్రధాన న్యాయమూర్తిపై కత్తిగట్టడం నిజంగా ఆందోళనకరమే!

 

 

న్యాయవ్యవస్థలోని జడ్జీలతో ప్రతిపక్షాలకే కాదు అధికార పక్షానికి కూడా విభేదాలు తలెత్తుతున్నాయి. తాజాగా జస్టిస్ జోసెఫ్ సీనియారిటీ వివాదం మన దేశంలోని వ్యవస్థల నడుమ ఒత్తిడి పట్టి చూపుతోంది. ఎప్పట్నుంచో కేరళకు చెందిన కేఎం జోసెఫ్ పదోన్నతిని కేంద్రం తొక్కి పెడుతోంది. సుప్రీమ్ కోర్టుకు జడ్జీలను నియమించే కొలీజియమ్ ఆయనని అత్యున్నత న్యాయస్థానంలో జడ్జ్ గా చాలా నెలల క్రితమే ఎంపిక చేసింది. అయినా ఆయనకున్న అనుభవం తక్కువంటూ, ఇతర కారణాలు చెబుతూ మోదీ సర్కార్ బ్రేకులు వేస్తూ వస్తోంది. ఎట్టకేలకు తప్పని పరిస్థితుల్లో జోసెఫ్ ను సుప్రీమ్ న్యాయమూర్తిగా గవర్నమెంట్ నియమించింది. కానీ, అంతలోనే తన స్టైల్లో తాను వ్యూహం అమలు చేసింది. మరో ఇద్దరు న్యాయమూర్తుల్ని కూడా నియమించిన కేంద్ర ప్రభుత్వం జోసెఫ్ ను మూడో స్థానంలో ప్రకటించింది. అంటే మిగతా ఇద్దరు జడ్జీల కంటే జోసెఫ్ జూనియర్ అవుతారు. జడ్జీగా ప్రమాణ స్వీకారం కూడా ఆయన మూడో వాడిగానే చేయాలి. దీని ఎఫెక్ట్ ఆయన ముందు ముందు భారత ప్రధాన న్యాయమూర్తి అవ్వటంపై కూడా వుంటుందట! అసలు ఇంతగా కేంద్రం జోసెఫ్ పై ఆగ్రహంగా వుండటానికి కారణం ఏంటి?

 

 

2016లో ఉత్తరాఖండ్ లోని ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించింది మోదీ గవర్నమెంట్. కానీ, ఆ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పించటానికి వీలు లేదని తీర్పు ఇచ్చారు జోసెఫ్. ఇది ఒక్కటే కారణమా? లేక ప్రభుత్వానికి , జస్టిస్ కి ఇంకా ఏమైనా విభేదాలున్నాయా? పబ్లిగ్గా తెలిసే అవకాశాలు తక్కువ. కానీ, ఇటువంటి పరిస్థితి కేవలం జోసెఫ్ కే కాదు చాలా మంది న్యాయమూర్తులకి ఉన్నట్టు కనిపిస్తోంది. మన తెలుగువాడైన జస్టిస్ చలమేశ్వర్ కూడా మోదీ ప్రభుత్వ వ్యతిరేకి అన్నట్టుగా ఒక వర్గం జాతీయ మీడియా కథనాలు రాసింది.

ప్రభుత్వానికి , అత్యంత శక్తివంతమైన న్యాయవ్యవస్థకి మధ్య దూరం పెరగటం వాంఛనీయం కాదు. కానీ, ఇప్పుడున్న రాజకీయ స్థితిగతుల్లో అది ఆపటం కూడా వీలు కాదు. కాకపోతే, ఇటు ప్రభుత్వం, అటు జడ్జీలు రెండు వైపుల నుంచీ ప్రజలు, దేశం శ్రేయస్సు ఆలోచిస్తే అన్నీ సాధ్యమే! ఆ పని జరగాలని ఆశిద్దాం…