మళ్ళీ అదే మాట.. రాజధానుల అంశంలో జోక్యం చేసుకోలేము

ఏపీ మూడు రాజధానుల అంశంతో తమకి సంబంధం లేదని కేంద్ర ప్రభుత్వం మరోసారి తేల్చి చెప్పింది. రాజధాని అంశంలో జోక్యం చేసుకోబోమంటూ ఇప్పటికే ఏపీ హైకోర్టులో కేంద్రం రెండు సార్లు అఫిడవిట్ దాఖలు చేసింది. తాజాగా ఇదే అంశంపై హైకోర్టులో కేంద్ర హోంశాఖ అదనపు అఫిడవిట్ దాఖలు చేసింది. విభజన చట్టంలో ఒకే రాజధాని ఉండాలని ఎక్కడా లేదని స్పష్టం చేసింది. విభజన చట్టం ప్రకారం మూడు రాజధానులను ఏర్పాటు చేసుకోవడంలో తప్పు లేదని తేల్చిచెప్పింది. 

 

మూడు రాజధానుల అంశంలో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో కేంద్ర హోంశాఖ తెలిపింది. మూడు రాజధానులను అడ్డుకోగలిగే అధికారం కేంద్రానికి ఉందనేది పిటిషనర్ దోనె సాంబశివరావు అపోహ మాత్రమేనని వెల్లడించింది. ఏపీ రాజధాని నిర్మాణానికి అవసరమైన ఆర్థిక సాయం చేస్తామని మాత్రమే తాము చెప్పిమని పేర్కొంది. అమరావతే ఏపీ రాజధాని అని కూడా తాము ఎక్కడా చెప్పలేదని, రాజధాని ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వ అంతిమ నిర్ణయమని స్పష్టం చేసింది.