జగన్ ప్రభుత్వానికి మరో షాకిచ్చిన కేంద్రం..!

జగన్ ప్రభుత్వానికి షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఎన్నో షాకులిచ్చిన కేంద్రం... తాజాగా మరో ఝలక్ ఇచ్చింది. ఏపీకి కొత్తగా మెడికల్ కాలేజీలు కేటాయించబోమని... అవసరమనుకుంటే మీరే కట్టుకోవాలంటూ తేల్చిచెప్పింది. అయితే, కేంద్రమే ముందుగా ప్రతిపాదనలు కోరి, ఇఫ్పుడు మీరే కట్టుకోమంటూ కేంద్రం చేతులెత్తేయడంపై రాష్ట్ర ప్రభుత్వం, అలాగే వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు కంగుతిన్నారు. కేంద్రంపై ఆశలు పెట్టుకునే తాము మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ముందడుగు చేస్తే, ఇప్పుడు నిధులు ఇవ్వమంటే ఎలా అంటున్నారు.

ప్రతి జిల్లాలో కచ్చితంగా ఒక మెడికల్ కాలేజీ ఉండేలా అన్ని రాష్ట్రాల నుంచి కేంద్రం ప్రతిపాదనలు కోరింది. దాంతో, ఆయా రాష్ట్రాలు తమ అవసరాలను తెలుపుతూ కేంద్రానికి ప్రతిపాదనలు పంపాయి. అయితే, వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించిన కేంద్రం... కొన్ని రాష్ట్రాలకు మాత్రమే కొత్త మెడికల్ కాలేజీలను కేటాయించింది. అయితే, ఏపీ... మూడింటికి ప్రతిపాదనలు పంపగా... ఒక్కటి కూడా ఇవ్వలేదు. అందుకు కేంద్రం అనేక కారణాలను చూపినప్పటికీ, ముఖ్యంగా ఏపీలోని 13 జిల్లాల్లో ఇప్పటికే మెడికల్ కాలేజీలు ఉన్నాయని... పశ్చిమగోదావరి, విజయనగరం మినహా అన్ని జిల్లాల్లోనూ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయని... ఈ రెండు జిల్లాల్లో కూడా ప్రైవేట్ కాలేజీలు ఉన్నందున... ఏపీలో కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు నిధులు కేటాయించలేమని స్పష్టంచేసింది.

అయితే, ఏపీ ప్రతిపాదనలను మరోసారి పరిశీలించాలని కేంద్రాన్ని కోరనున్నట్లు తెలుస్తోంది. ఏలూరు, పాడేరు, విజయనగరంలో మెడికల్ కాలేజీల ఏర్పాటుకు సహకరించాలని... ఒక్కో కాలేజీకి 340కోట్ల రూపాయల చొప్పున నిధులు కేటాయించాలని మళ్లీ కేంద్రానికి విజ్ఞప్తి చేయనున్నారు. ఇప్పటికే ఏలూరు మెడికల్ కాలేజీకి సీఎం జగన్ శంకుస్థాపన చేశారని, అలాగే... మిగతా రెండు కాలేజీలకూ ఫౌండేషన్ స్టోన్ వేసేందుకు రెడీ అవుతున్నందున నిధులు ఇవ్వాలని కేంద్ర పెద్దలను కోరనున్నారు. అంతేకాదు, సరికొత్త లెక్కలతో కేంద్రం ముందు మళ్లీ ప్రతిపాదనలు పెట్టనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా జనాభా ప్రాతిపదికన కొత్త కాలేజీలకు అనుమతి ఇవ్వాలని కోరనున్నారు. తమిళనాడులో 25 జిల్లాలు ఉన్నప్పటికీ... ప్రతి జిల్లాలో 20లక్షల మంది జనాభా మాత్రమే ఉన్నారని... అయితే, ఏపీలోని 13 జిల్లాల్లో ప్రతి చోటా 40లక్షల మంది జనాభా ఉన్నారని... అందువల్ల జనాభా ప్రాతిపదికన ఏపీకి కొత్త మెడికల్ కాలేజీలు కేటాయించాలని కోరనున్నారు.

అయితే, కేంద్రానికి ప్రతిపాదనలు పంపిన ఏలూరు, పాడేరు, విజయనగరంతోపాటు పులివెందుల, మచిలీపట్నం, గురజాల, మార్కాపురంలో కూడా మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని జగన్ ప్రభుత్వం భావిస్తోంది. అయితే, కేంద్రం షాక్ ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచనలో పడింది. ఒకవేళ రెండోసారి కూడా రాష్ట్ర ప్రతిపాదనలను కేంద్రం తిరస్కరిస్తే మాత్రం... ఏడు మెడికల్ కాలేజీల నిర్మాణానికి దాదాపు 2500కోట్ల రూపాయల భారం రాష్ట్రంపై పడనుంది. ఇప్పటికే, ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతోన్న ఏపీ... అంత పెద్ద మొత్తాన్ని భరించగలిగే పరిస్థితిలో లేదంటున్నారు అధికారులు.