కేంద్ర బడ్జెట్ లో కేసీఆర్ మార్క్.. టీఆర్ఎస్ కు బోలెడంత మైలేజ్!!

 

తెలంగాణలో కేసీఆర్ కు రైతుబంధు పథకం ఎంత మైలేజ్ తీసుకొచ్చిందో తెలిసిందే. ఈమధ్య జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ఘన విజయం సాధించడానికి ఓ రకంగా రైతు బంధు పథకం కూడా కారణమనే చెప్పాలి. రైతు బంధు ప్రజల్లోకి బాగా వెళ్ళింది. పక్క రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఈ పథకాన్ని అమలు చేయడానికి సిద్ధమవుతున్నాయి. కేసీఆర్ కూడా ఈ పథకం దేశవ్యాప్తంగా ఉండాలని ఇప్పటికే అన్నారు. కేసీఆర్ ప్రస్తుతం 'ఫెడరల్ ఫ్రంట్' తో జాతీయ రాజకీయాల్లో తన మార్క్ చూపించడానికి సిద్దమైన విషయం తెలిసిందే. 'ఫెడరల్ ఫ్రంట్' అజెండాలో రైతు బంధు ఉంది. ఫెడరల్ ఫ్రంట్ వస్తే.. దేశవ్యాప్తంగా రైతు బంధు అమలు చేస్తామని కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. అయితే ఇప్పుడు కేంద్రం కేసీఆర్ బాటలో నడుస్తుంది. తెలంగాణలో కేసీఆర్ కి మైలేజ్ తెచ్చిన.. అలాగే ఇతర రాష్ట్రాల్లో సీఎంలకు మైలేజ్ తీసుకురావడానికి సిద్దమైన పథకానికి కేంద్రం శ్రీకారం చుట్టింది. దీంతో దేశవ్యాప్తంగా రైతులకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది.

ఈరోజు కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ బడ్జెట్ లో కేసీఆర్ మార్క్ కనిపించింది. తెలంగాణలో విజయవంతంగా అమలవుతున్న రైతుబంధు పథకం తరహాలోనే దేశవ్యాప్తంగా ఉన్న చిన్న, సన్నకారు రైతులకు నగదు బదిలీ పథకాన్ని బీజేపీ ప్రభుత్వం ప్రకటించింది. కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని గత ఏడాది డిసెంబర్ నుంచే అమలు చేయబోతున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఐదెకరాల లోపు ఉన్న రైతుల బ్యాంక్ అకౌంట్‌లోకి ఏడాదికి ఆరు వేల రూపాయలు జమ చేయనున్నట్టు బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. మూడు విడతల్లో ఈ మొత్తానికి జమ చేస్తామని ప్రకటించారు. ఇందుకోసం రూ. 75 వేల కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అన్నారు. ఈ పథకం ద్వారా దేశంలోని  12కోట్లమంది రైతులకు లబ్ది కలుగుతుందని తెలిపారు. అయితే 6 వేలు.. మూడు విడతలంటే రైతులు నుంచి స్పందన ఎలా ఉంటుందో తెలీదు కానీ.. కేంద్రం నిర్ణయం కేసీఆర్ ప్రభుత్వానికి అన్ని విధాలా కలిసొచ్చేలా ఉంది.

కేంద్రం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రవేశపెట్టడం ద్వారా.. రైతుబంధు పథకానికి కేంద్రం నుంచి నిధులు రానున్నాయి. ఆ రకంగా తెలంగాణ ప్రభుత్వానికి ఏటా కొన్ని వేల కోట్ల రూపాయల నిధులు ఆదా కావొచ్చని తెలుస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రైతు బంధు పథకం మొత్తాన్ని పెంచాలని నిర్ణయించుకున్న తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం తీసుకున్న నిర్ణయం కలిసొచ్చిందనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు కేంద్రం.. రైతుబంధు పథకాన్ని అమలు చేయడంపై టీఆర్ఎస్ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. తెలంగాణ ప్రభుత్వం మోడల్‌ను కేంద్రం అమలు చేసిందనే క్రెడిట్ తమకు దక్కుతుందని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ఈ అంశం తమకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నారు. రైతు సంక్షేమంలో కేంద్రం కూడా తమను ఫాలో అవుతుందని చెప్పుకోవడానికి టీఆర్ఎస్ ప్రభుత్వానికి అవకాశం లభించింది. మరి ఈ అవకాశాన్ని టీఆర్ఎస్ ఎలా వినియోగించుకుంటుందో చూడాలి.