కేంద్రం చేతిలో రాష్ట్ర భవిష్యత్

 

ఇంతకు ముందు రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే దాని చేతిలోనే రాష్ట్ర భవిష్యత్ ఉండేది. కానీ ఈసారి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చేతిలో కంటే కేంద్రం చేతిలోనే ఎక్కువగా ఉండబోతోంది. వివిధ ప్రాజెక్టులు, రాజధాని నిర్మాణం వంటి భారీ వ్యయమయ్యే పనులకు నిధుల కోసం కేంద్రం మీద ఎలాగూ ఆధారపడక తప్పదు. రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తగిన్నని ఆదాయవనరులు లేకపోవడంతో రాష్ట్ర కనీసావసరాలయిన ప్రభుత్వ నిర్వహణ, ఉద్యోగుల జీతాలు చెల్లింపులకు, సంక్షేమ కార్యక్రమాలు అమలు, ఇత్యాది అవసరాలకు కేంద్రప్రభుత్వం విదిలించే నిధులపైనే ఆధారపడవలసిన దుస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో ఏర్పడే కొత్త ప్రభుత్వం మళ్ళీ రాష్ట్ర ఆర్ధిక స్థితిని గాడిన పెట్టేవరకు, పరిస్థితి క్లిష్టంగానే ఉండవచ్చును. ఒకవేళ ఏ కారణం చేతయినా రాష్ట్ర ప్రభుత్వం విఫలమయినట్లయితే రాష్ట్ర పరిస్థితి మరింత దారుణంగా మారే ప్రమాదం ఉంది. ఇక ఒకవేళ తెలంగాణాలో తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్లయితే నదీజలాలతో సహా అనేక విషయాలలో వారితో సమస్యలు ఉత్పన్నం కావచ్చును. వాటి పరిష్కారానికి కేంద్రప్రభుత్వ సహకారం చాలా అవసరం. అందువల్ల ఈ సారి ఎన్నికలలో సీమాంద్రాకు పూర్తి సహకారం అందించే పార్టీనే కేంద్రంలో కూడా ఎన్నుకోవలసి ఉంటుంది.